ఆదోని తహసీల్దార్ బదిలీలో ‘రాజకీయం’
శేషఫణి రజినీకాంత్ రెడ్డి అబ్దుల్ వాహబ్
ఆదోని: కూటమి పాలనలో అధికారులకు విలువ లేకుండా పోతోంది. నాయకులకు నచ్చినట్లు మెలగకపోయినా, ఆ పార్టీలోని ఏ ఒక్కరికి ఎదురుచెప్పినా మరో ప్రాంతానికి బదిలీపై వెళ్లక తప్పని పరిస్థితి. చిరుద్యోగులకే కాదు, మండల మేజిస్ట్రేట్ స్థాయి తహసీల్దారులైనా తమ స్థానాన్ని కాపాడుకునేందుకు జీ హుజూర్ అనక తప్పడం లేదు. ఇక కూటమి పాలనలో మూడు పార్టీల్లో ఏ ఒక్కరికి నచ్చకపోయినా ఆ అధికారి జీవితం ఆటబొమ్మగా మారిపోతోంది. గతంలో అతను నాతో సరిగా మెలగలేదని ఒకరు.. ఇతను ప్రతిపక్ష పార్టీ అని ఇంకొకరు.. కొత్త వ్యక్తి మాకొద్దని మరొకరు.. ఇలా అధికారులను ఎవరికి తోచిన రీతిలో వాళ్లు అక్కడా ఇక్కడ తిప్పడం పరిపాటిగా మారింది. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారా, లేదా అనేది పక్కనపెట్టి మన చెప్పుచేతల్లో ఉంటున్నాడా లేదా అనే విషయానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో అధికారులు రాజకీయ ఛట్రంలో కంటి మీద కునుకు లేకుండా ఉద్యోగాలను నెట్టుకొస్తున్నారు. తాజాగా ఆదోని తహసీల్దార్ పోస్టు విషయంలో చోటు చేసుకున్న ‘రాజకీయం’ అధికారుల దీనావస్థకు అద్దం పట్టింది. డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించడంతో కొందరికి స్థానచలనం కలిగింది. ఈ కోవలోనే ఆదోని తహసీల్దార్‌గా పనిచేస్తున్న శేషఫణిపై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో కౌతాళం డిప్యూటీ తహసీల్దార్ రజనీకాంత్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అయితే రజనీకాంత్ రెడ్డి నియామకం కూటమిలోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు వర్గానికి మింగుడుపడలేదు. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే ఆ ఉత్తర్వులు మారిపోయాయి. కౌతాళం డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న ఆయనను పదోన్నతిపై అక్కడే తహసీల్దార్‌గా కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. నందవరం తహసీల్దార్ అబ్దుల్ వాహబ్‌ను ఆదోని తహసీల్దార్‌గా బదిలీ చేశారు. ఈసారి బీజేపీ నేతలు తెరపైకి వచ్చారు. అబ్దుల్‌వాహబ్ నియామకం కూటమిలోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వర్గానికి నచ్చకపోవడంతో ఆయనను కూడా తిరిగి పాత స్థానమైనా నందవరానికే డిప్యూటేషన్‌పై పంపించేశారు. ఈ పరిణామాల మధ్య ప్రస్తుతం ఆదోని తహసీల్దార్‌గా శేషఫణినే కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈయన స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తారనే ప్రచారం ఉంది. ఎనిమిది నెలల క్రితం ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన ఆయనకు బలమైన రాజకీయ మద్దతు ఉండటంతోనే స్థానం పదిలం చేసుకోగలిగారనే చర్చ జరుగుతోంది. శేషఫణి తన సర్వీసులో సస్పెండ్ అయినప్పటికీ అధికార పార్టీ అండదండలతోనే తిరిగి పోస్టింగ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఒక్క పోస్టుకు ముగ్గురు అధికారుల మధ్య జరిగిన ‘రాజకీయ’ పోరు అధికార వర్గాల్లో చర్చకు తావిస్తోంది. నేతల సిఫార్సులతో సీటు పదిలం చేసుకుంటున్న అధికారులు పారదర్శక సేవలు ఎంత మేరకు అందించగలరనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
కూటమి నేతల సిఫారసుతో
మూడుముక్కలాట
నాయకులను మెప్పించలేక
అధికారుల పాట్లు
ఇద్దరు తహసీల్దార్ల ఉత్తర్వులు
అప్పటికప్పుడు మార్పు
ఎట్టకేలకు పాత తహసీల్దారే
కొనసాగింపు


