మూగజీవుల ఆపద్బాంధవుడు | - | Sakshi
Sakshi News home page

మూగజీవుల ఆపద్బాంధవుడు

Jun 7 2026 8:06 AM | Updated on Jun 7 2026 8:06 AM

● కష్టంలో ఉన్నాయని తెలిస్తే చాలు సాయం చేస్తాడు ● ఆదుకుని అక్కున చేర్చుకుని వైద్యం చేయిస్తాడు ● అవి కోలుకున్నాక యథా స్థానంలో వదిలేస్తాడు ● సంరక్షణ కోసం ప్రత్యేక షెల్టర్‌ ఏర్పాటు

● కష్టంలో ఉన్నాయని తెలిస్తే చాలు సాయం చేస్తాడు ● ఆదుకుని అక్కున చేర్చుకుని వైద్యం చేయిస్తాడు ● అవి కోలుకున్నాక యథా స్థానంలో వదిలేస్తాడు ● సంరక్షణ కోసం ప్రత్యేక షెల్టర్‌ ఏర్పాటు

కర్నూలు(హాస్పిటల్‌): ఆపదొస్తే మనుషులకు సాటి మనుషులు ఎవరో ఒకరు సాయం చేస్తారు. కానీ మూగజీవులకు ఎవరు సాయం చేస్తారు. అయితే ఇలాంటి జీవుల కోసం మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు వాక్‌ సంస్థ ప్రతినిధులు. ఏ మూగ జీవైనా కష్టంలో ఉందని తెలిస్తే చాలు వెంటనే దాని వద్దకు చేరుకుంటారు. దానిని రక్షించడం/వైద్యం చేయించడం చేసి అది కోలుకునేంత వరకు తన వద్దే ఉంచుకుంటారు. బాగయ్యాక తిరిగి అది ఎక్కడ దొరికిందో అక్కడికే వెళ్లి వదిలేస్తారు. ఆ జీవి వైకల్యం చెంది ఎక్కడికి వెళ్లలేకపోని పరిస్థితిలో ఉంటే తన వద్దే ఉంచుకుని ఆలనాపాలనా చూసుకుని పోషిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సంఘాన్ని కూడా రిజిస్టర్‌ చేయించి ఆదుకుంటున్నాడు ఈ సంస్థ సృష్టికర్త, మూగజీవుల ఆపద్బాందవుడు శివకుమార్‌. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనికి చెందిన రిటైర్డ్‌ ఆర్‌టీసీ డ్రైవర్‌ పి.తిరుపాల్‌ కుమారుడైన పి.శివశంకర్‌ ఇంటర్‌ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత డిగ్రీలో చేరినా ఇతర కారణాల వల్ల మధ్యలోనే చదువు మానేశాడు. ప్రభుత్వ వసతి గృహాలకు అవసరమైన స్నాక్స్‌ను సరఫరా చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మూగజీవులపై ఉన్న మమకారం అతనికి సరికొత్త దారి చూపింది. ఎక్కడైనా ఏ మూగజీవైనా సరే ఆపదలో ఉన్నట్లు తెలిసిందంటే వెంటనే ఆ ప్రాంతంలో వాలిపోతాడు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌ చేసి ఆ జీవిని రక్షిస్తాడు. రోడ్డు ప్రమాదాల్లో, ఇతర ప్రమాదాల్లో గాయపడిన, అనారోగ్యం బారిన పడిన జీవులేవైనా సరే వాటిని అక్కున చేర్చుకుంటాడు. వాటికి దగ్గరుండి సపర్యలు చేస్తూ ప్రభుత్వ జంతువుల ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తాడు. అవి బాగయ్యేంత వరకు వాటి ఆలనాపాలనా చూస్తాడు. వాటిని బంధీఖానాలో ఉంచకుండా అవి ఎక్కడ లభించాయో అక్కడే తెచ్చి వదిలేసి వాటికి స్వేచ్ఛావాయువులు ప్రసాదిస్తాడు.

వాక్‌ సంస్థ స్థాపన..

మూగజీవులకు సేవలందించేందుకు అతను ఓ ప్రత్యేక సంస్థను స్థాపించాడు. 2021లో వెల్ఫేర్‌ ఆఫ్‌ యానిమల్స్‌ అండ్‌ లిబరేషన్‌ కర్నూలు(వాక్‌) అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన షెల్టర్‌ను స్థానిక కర్నూలు నగర శివారులోని పంచలింగాల చెక్‌పోస్ట్‌ సమీపం నుంచి మామిదాలపాడు గ్రామానికి వెళ్లేదారిలో ఏర్పాటు చేశాడు. గాయపడిన, అనారోగ్యం బారిన పడిన జంతువులు, పక్షులను ఆ కేంద్రానికి తీసుకెళ్లి సపర్యలు చేస్తాడు. ఇందులో వైకల్యం చెందిన వాటిని తన వద్దే ఉంచుకుని జీవితాంతం చూసుకుంటాడు. ఎక్కడైనా ఏదైనా మూగజీవి ప్రమాదంలో ఉందని, అనారోగ్యంలో ఉందని సమాచారం (వాక్‌ సంస్థ 99668 64428)కు చెబితే చాలు వెంటనే ఆ సంస్థ ప్రతినిధులు వచ్చి ఆ జీవిని కాపాడే ప్రయత్నం చేస్తారు.

సొంత నిధులతో షెల్టర్‌..

ఒకవైపు ప్రభుత్వ వసతి గృహాలకు అవసరమైన స్నాక్స్‌ను సరఫరా చేస్తూ జీవనం సాగిస్తున్న శివకుమార్‌ మరోవైపు మూగజీవుల ఆదరణకు సంపాదించిన సొమ్మును ఖర్చు చేస్తున్నాడు. మూగజీవులకు చికిత్స అందించడమే గాక వాటి ఆలనాపాలనా చూడటం, ఆహారం అందించడం, వైద్య ఖర్చులు, షెల్టర్‌ నిర్వహణ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ఈ మేరకు అతనికి ప్రతి నెలా రూ.40 వేల నుంచి రూ.60 వేల దాకా వెచ్చిస్తున్నాడు. ఇతని సేవా కార్యక్రమాలు చూసి ఎవ్వరైనా దాతలు స్పందించి విరాళం ఇస్తే తీసుకుంటాడు. లేకపోతే సొంత నిధులతోనే వాటిని సంరక్షిస్తాడు. ఈ యజ్ఞంలో అతనికి కొందరు స్వచ్ఛంద సేవకులు సహకరించారు. ప్రస్తుతం అతనితో పాటు ఇద్దరు సేవకులు సహాయం చేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఆయన కర్నూలు నగర పరిసర ప్రాంతాల్లో 2 వేలకు పైగా జంతువులు, పక్షులను సంరక్షించాడు. ఇందులో కుక్కలు, కోతులు, ఆవులు, ఇతర జంతువులతో పాటు కాకులు, గద్దలు, చిలుకలు, ఇతర పక్షులు, పాములు సైతం ఉన్నాయి. గుత్తిలో ఒక శునానికి తల వద్ద పెద్ద రంధ్రం పడి తీవ్ర అనారోగ్యం ఉండి అనాథగా ఉందని తెలిసి అక్కడికి వెళ్లి దానిని తీసుకొచ్చి సంరక్షించాడు. ఓ కోతి కళ్లకు గాయం తగిలి గుడ్డిదై పోయింది. దానినీ ఆయనే ఆలనాపాలనా చూసుకుంటున్నాడు. ఇలాంటి జీవులు ఆయన వద్ద ఎన్నో ఉన్నాయి. షెల్టర్‌ నిర్వహణను చూసి అవసరమైన వస్తువులు, సరుకులు సహాయం చేసినా చాలని శివకుమార్‌ కోరుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement