● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని బీఎల్‌ఓలను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. అనర్హుల పేర్లు జాబితాలో చేరకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ హాలులో శనివారం ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలకు ‘ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం’పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్యుమరేషన్ ఫారమ్‌లను పూరించి ఓటరు లేదంటే ఇంటి పెద్దల సంతకం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. వాటిని డిజిటలైజ్ చేసి డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. ఎన్యుమరేషన్ ఫారమ్‌లు తిరిగి రాని సందర్భాల్లో కేవలం నాలుగు కారణాలైన ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ అనే వివరాలను మాత్రమే నమోదు చేయాలన్నారు. ఈ వివరాల ఆధారంగా బూత్ వారీగా ప్రత్యేక జాబితాలు తయారు చేసి ప్రజల అభ్యంతరాల కోసం అందుబాటులో ఉంచాలన్నారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తారన్నారు. జిల్లాలో మొత్తం 14 లక్షల మంది ఓటర్లలో ఇప్పటికే 10 లక్షల మందికి పైగా మ్యాపింగ్ పూర్తయిందన్నారు. మ్యాపింగ్ సక్రమంగా జరగకపోతే సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగవద్దని సిబ్బందికి సూచించారు. ప్రత్యేక సర్వే, మ్యాపింగ్, ఫారమ్‌ల డిజిటలైజేషన్ తదితర పనులను జూన్ 14లోపు వంద శాతం పూర్తి చేసి నివేదికలు సమర్పించాలన్నారు. అనంతరం బీఎల్‌ఓలకు గొడుగు, క్యాప్ తదితర వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. డీఆర్‌ఓ రామునాయక్, నంద్యాల ఆర్డీఓ, ఈఆర్‌ఓ విశ్వనాధ్, ఆరు మండలాల తహసీల్దార్లు, అన్ని పోలింగ్ స్టేషన్ల బీఎల్‌ఓలు పాల్గొన్నారు.


