కొలిమిగుండ్ల: స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇటీవల జరిగిన కస్టోడియల్ డెత్‌పై విచారణ చేపట్టినట్లు బనగానపల్లె ఆర్డీఓ నరేంద్రనాథ్‌రెడ్డి శనివారం తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బెలుం శింగవరానికి చెందిన దొమ్మరి వెంకటసుబ్బయ్యను ట్రాక్టర్ చోరీ కేసులో ఏప్రిల్ 18న పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. పోలీస్ స్టేషన్‌లోని బాత్రూంలో ఉరివేసుకొని వెంకటసుబ్బయ్య మృతి చెందాడు. దీనిపై జిల్లా కలెక్టర్ మెజిస్ట్రీరియల్ విచారణ చేయమని ఆదేశించారన్నారు. ఇందులో భాగంగానే మృతునికి చెందిన ఏడుగురు కుటుంబ సభ్యులు, పోలీస్, రెవెన్యూకు చెందిన మొత్తం 16 మందిని విచారించామన్నారు. విచారణ నిర్వహణపై వారం రోజుల క్రితం బహిరంగ నోటీసు ఇచ్చామని, ఈ ఘటనపై బయట వ్యక్తులకు ఎవరికై నా అభ్యంతరాలుంటే ఫిర్యాదు ఇవ్వవచ్చని పేర్కొన్నామన్నారు. విచారణలో భాగంగా ఇంకా కొంత మంది వైద్యులతో పాటు సంఘటన జరిగిన సమయంలో ఇక్కడ విధులు నిర్వహించిన తహసీల్దార్‌ను విచారించాల్సి ఉందన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ ముగించి నివేదికలను కలెక్టర్‌కు అందజేస్తామని చెప్పారు.


