కర్నూలు(అర్బన్): రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి, గుంటూరు వ్యవసాయ డైరెక్టరేట్ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు కోరారు. శనివారం వారు జాతీయ ఆహార భద్రత మిషన్, జాతీయ నూనెగింజల అండ్ ఆయిల్ పామ్ మిషన్ పథకాల కింద రైతులకు సరఫరా చేస్తున్న విత్తనాల నాణ్యత, పరిమాణం, ప్యాకింగ్ విధానాలపై విత్తన సరఫరా సంస్థలైన ఏపీ సీడ్స్, ఎన్‌ఎస్‌సీ, హెచ్‌ఐఎల్ గోదాములను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీడ్ ట్రీట్‌మెంట్, రసాయనాలు, సంబంధిత పంటల సాగు విధానాల బ్రోచర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్తి విత్తన ప్యాక్‌తో పాటు సీడ్ ట్రీట్‌మెంట్ కెమికల్, సంబంధిత పంట సాగు విధానాల బ్రోచర్‌ను తప్పనిసరిగా జత చేయాలన్నారు. నాణ్యమైన విత్తనాల ప్యాకింగ్ పూర్తి చేసి సంబంధిత ప్రాంతాలు, రైతు సేవా కేంద్రాలు, మండలాలకు తక్షణమే డిస్పాచ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి అల్లీపీర, మండల వ్యవసాయ అధికారి విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


