ముగిసిన సప్లిమెంటరీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన సప్లిమెంటరీ పరీక్షలు

Jun 6 2026 1:29 AM | Updated on Jun 6 2026 1:29 AM

కర్నూలు సిటీ: పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. గత నెల 28న బక్రీద్‌ పండుగ సందర్భంగా వాయిదా పడిన పరీక్షను శుక్రవారం నిర్వహించారు. చివరి రోజున ఇంగ్లిష్‌ పరీక్షకు 916 మంది విద్యార్థుల్లో 692 మంది హాజరయ్యారు. డీఈఓ ఎల్‌.సుధాకర్‌ రెండు కేంద్రాలను, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ రెండు కేంద్రాలు, స్క్వాడ్‌ బృందాలు 15 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. మూల్యాంకనం ఈ నెల 8, 9, 10 తేదిల్లో చేపట్టనున్నారు.

● ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షలు ముగియడంతో ఈ నెల 7వ తేది నుంచి మూల్యాంకనం నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప తెలిపారు. ప్రభుత్వ(టౌన్‌ మోడల్‌) జూనియర్‌ కాలేజీలో నిర్వహించే మూల్యాంకనానికి ఎంపిక చేసిన సిబ్బందికి నేడు(శనివారం) స్పాట్‌పై అవగాహన కల్పించనున్నారు. సుమారుగా లక్ష సమాధాన పత్రాలు జిల్లాకు వచ్చినట్లు తెలిసింది.

రైతులను వెక్కిరిస్తున్న ధరలు

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిరాశాజనకంగా ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌కు వేరుశశనగ 173 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.5,400, గరిష్ట ధర రూ.7,831 లభించింది. సగటు ధర రూ.6520 మాత్రమే నమోదైంది. ఎక్కువ లాట్లకు కేవలం రూ.6వేల నుంచి రూ.6500 మాత్రమే ధర లభించినట్లు తెలుస్తోంది.

● వాము మార్కెట్‌కు 310 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.4,450, గరిష్ట ధర రూ.24,288 లభించగా.. సగటు ధర రూ.19,050 నమోదైంది. వాముకు ఇటీవల గరిష్ట ధర రూ.30 వేల వరకు పలికింది.

● మిర్చి(రెడ్‌) ధరలు దయనీయంగా మారడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనిష్ట ధర రూ.5,555, గరిష్ట ధర రూ.13,639 లభించింది. సగటు ధర రూ.9,619 నమోదైంది. మార్చి, ఏప్రిల్‌ నెలలో లభించిన ధరలతో పోలిస్తే 60 శాతం వరకు ధరలు పడిపోవడం గమనార్హం.

ఆర్‌ఆర్‌బీ పరీక్షలకు ఉచిత శిక్షణ

కర్నూలు(అర్బన్‌): రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు–అసిస్టెంట్‌ లోకో పైలెట్‌, గ్రూపు – డీ – 2026 పరీక్షలకు స్థానిక బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ కె.ప్రసూన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్‌టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు ఈ నెల 11లోగా బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయం, అబ్బాస్‌నగర్‌, కల్లూరు తహసీల్దార్‌ కార్యాలయం, కర్నూలు అనే చిరునామాలో దరఖాస్తులను అందజేయాలన్నారు. వంద మంది అభ్యర్థులకు రెండు నెలల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్‌, స్టడీ మెటీరియల్‌ అందిస్తామన్నారు. ఇతర వివరాలకు 08518 – 236076, 9652093661 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

అక్రమంగా ఐరన్‌ ఓర్‌ తవ్వకాలు

టాస్క్‌ఫోర్స్‌: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు అక్రమంగా సంపాదించుకోవడానికి పలు మార్గాలను ఎంచుకున్నారు. గ్రామాల్లో విచ్చల విడిగా బెల్టుషాపులు ఏర్పాటు చేసుకున్నారు. అదీ చాలక ఇసుక వ్యాపారం చేస్తున్నారు. వీటికి అదనంగా ఐరన్‌ ఓర్‌ తవ్వకాలు చేపడుతున్నారు. బేతంచెర్ల మండలంలోని గూటుపల్లె, హుసేనాపురం, తవిసికొండ, పాపాసాని కొట్టాల, రేపల్లె, వీరాయపల్లె పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఐరన్‌ ఓర్‌ తవ్వుతున్నారు. ఇందుకోసం జేసీబీ, హిటాచీ వాహనాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇనుప ఖనిజం తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ, భూగర్భ గనులశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. టీడీపీ నాయకుల తవ్వకాలకు సహకరించడంతోపాటు వారు అనుకున్న ప్రాంతాలకు ఐరన్‌ఓర్‌ను తరలించే ప్రకియలో కొందరు అధికారులు పాలు పంచుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement