● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు
ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు(టౌన్): రెండేళ్ల ప్రభుత్వ పాలనలో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక గిప్సన్ కాలనీలోని ఆయన స్వగృహంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని 25వ వార్డు నుంచి 46వ వార్డు వరకు బూత్ ఏజెంట్లు, వార్డు నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, బూత్ స్థాయిలో కార్యకర్తల సమన్వయం, ఎస్‌ఐఆర్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మోసగిస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా అతీగతీ లేకపోవడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. కర్నూలు నియోజకవర్గంలో ఈనెల 14 నుంచి వచ్చే నెల 15 వరకు నిర్వహించే ఎస్‌ఐఆర్ సర్వే కీలకమని, పార్టీ పరంగా ప్రభుత్వం నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు ఈ విషయంలో చురుగ్గా వ్యవహరించాలన్నారు. కూటమి నేతలు ఓట్లు తొలగించడం, బోగస్ ఓట్లు చేర్చడం వంటి అనైతిక చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఎస్వీ విజయ మనోహరి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు మహిళలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయలేకపోయాడన్నారు. మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో అరకొర బస్సులు ఏర్పాటు చేసి మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అబద్ధాలు చెప్పిన ఈ ప్రభుత్వానికి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు.


