మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ | - | Sakshi
Sakshi News home page

మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ

Jun 6 2026 1:29 AM | Updated on Jun 6 2026 1:29 AM

కర్నూలు(సెంట్రల్‌): మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి సి.సెల్వం అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ నుంచి కలెక్టరేట్‌ వరకు కొనసాగిన ర్యాలీలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్‌ కాలుష్యం పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, అందువల్ల ప్లాస్టిక్‌ని తమ జీవనశైలి నుంచి తొలగించడం మంచిదన్నారు. సముద్రం, భూమి, చివరకు మనిషి శరీరంలోకి కూడా ప్లాస్టిక్‌ వ్యర్థాలు చేరిపోతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఫలితంగా క్యాన్సర్‌ మహమ్మారి విజృంభిస్తోందన్నారు. ఇప్పటికై నా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయాధికారి పి.వి.కిశోర్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిక్షణకు జిల్లా యంత్రాంగం వారం రోజులుగా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. కళాజాతాల ద్వారా పాటలు, నృత్యాలతో ప్రజల్లో చైతన్యం కల్పించామన్నారు. కార్యక్రమంలో కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు, సీనియర్‌ సైంటిస్టు ఎంబీఎస్‌ శంకరరావు, పీసీబీ అధికారి స్వామి వివేకానంద, అటవీ అధికారిని తేజస్వి, ప్రియాంక, పి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement