మంత్రాలయం: పవిత్ర తుంగభద్ర నదీ తీరాన వెలసిన సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వర్ణ పల్లకోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం మఠం ప్రాంగణంలో దివాన్ సుజయింద్ర ఆచార్, బృందావనం, అర్చకులు శ్రీకాంత్ స్వామి, సహాయ పీఆర్వో హొన్నళ్లి వ్యాసరాజచార్ ఆద్వర్యంలో మృతికా బృందావనాన్ని బంగారు పల్లకిలో ఉంచి అశేష జనవాహిని నడుమ భజా భంత్రీల నడుమ, మంగళ వాయిద్యాలతో నమో రాఘవేంద్ర నామస్మరణంతో ఊరేగించారు. ప్రవచన మండపంలో బంగారు పల్లకి సేవ చేయించి భక్తులకు విశేష దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు భక్తులకు ఆశీర్వచనాలు గావించారు. కార్యక్రమంలో మఠం అధికారులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా
సిట్రా సత్యనారాయణమ్మ
కర్నూలు(టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి(కర్నూలు పార్లమెంట్)గా మాజీ జిల్లా అధ్యక్షురాలు, తాజా మాజీ కార్పొరేటర్ సిట్రా సత్యనారయణమ్మ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
10న జెడ్పీ సర్వసభ్య సమావేశం
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 10న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ జి.వి.రమణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన స్థానిక జెడ్పీ సమావేశ భవనంలో నిర్వహించనున్న సమావేశంలో వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, పాఠశాల విద్యా శాఖలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. సమావేశానికి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు, జెడ్పీటీసీ, కోఆప్షన్ సభ్యులు, కర్నూలు, నంద్యాల పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఎంపీపీ, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన చైర్మన్లు హాజరు కావాలని ఆయన కోరారు.
ఒకవైపు ఎండలు,
మరోవైపు వానలు
కర్నూలు(అగ్రికల్చర్): ఒకవైపు ఉష్ణోగ్రతలు కొనసాగుతుండగా.. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు 14 మండలాల్లో వర్షం కురిసింది. రెండు, మూడు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. దేవనకొండలో అత్యధికంగా 85.4 మి.మీ వర్షపాతం నమోదైంది. చిప్పగిరిలో 66.6, పత్తికొండలో 36.6, మద్దికెరలో 10, కల్లూరులో 8.8 మిమీ ప్రకారం వర్షాలు కురిశాయి. ఇదిలాఉంటే ఉష్ణోగ్రతలు కూడా తగ్గడం లేదు. పాణ్యంలో 40.3, గోస్పాడులో 40.3, చాగలమర్రిలో 39.9, ఆళ్లగడ్డలో 39.4, కల్లూరులో 38.8 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రెండు లక్షల సీడ్ బాల్స్ తయారీ లక్ష్యం
కర్నూలు కల్చరల్: అటవీ శాఖ ఆధ్వర్యంలో కర్నూలు, ఆదోని రేంజ్‌లలో రెండు లక్షల సీడ్ బాల్స్ తయారీ లక్ష్యంగా పెట్టుకున్నామని కర్నూలు ఇన్‌ఛార్జి స్క్వాడ్ డీఎఫ్‌వో స్వామి వివేకానంద తెలిపారు. కర్నూలు విజయవనం పుల్లయ్య పార్క్‌లో సీడ్ బాల్స్‌ను తయారు చేయిస్తున్నామన్నారు. ఈనెల 20వ తేదీ తరువాత వాటిని వివిధ ప్రాంతాలకు చేరవేస్తామన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జెడ్పీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సీడ్ బాల్స్ తయారీపై అవగాహన కల్పించడంతో పాటు మొక్కలు నాటుతామన్నారు.అనంతరం జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపడతామన్నారు. కార్యక్రమంలో కర్నూలు, ఆదోని రేంజ్ ఆఫీసర్లు ప్రియాంక, తేజశ్వి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు ఓబులేష్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


