బైక్‌ ఢీకొని మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ ఢీకొని మహిళ మృతి

Jun 5 2026 4:17 AM | Updated on Jun 5 2026 4:17 AM

కర్నూలు: నగరంలో కిడ్స్‌ వరల్డ్‌ సమీపంలోని యునానీ హాస్పిటల్‌ వద్ద బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో బి.నాగేశ్వరమ్మ (51) మృతిచెందారు. కల్లూరు మండలం గోకులపాడు గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మ, చిన్నసుంకన్న దంపతులు కొంతకాలంగా పాతబస్తీలోని రాధాకృష్ణ టాకీస్‌ వెనుక ఉన్న డబరా వీధిలో నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు కొడుకులు. ఎగ్జిబిషన్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ దుకాణాల్లో నాగేశ్వరమ్మ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. గురువారం ఉదయం ఇంటి వద్ద నుంచి మనవరాలు శాంతిప్రియతో కలసి షాపుల్లో పనిచేయటానికి వెళ్తుండగా స్థానిక యునానీ హాస్పిటల్‌ వద్ద వెనుకనుంచి బైక్‌ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరమ్మ తల వెనుకభాగంలో తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో పడిపోయింది. మనవరాలి తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఎదురుగా గోశాల వద్ద అరటి పండ్ల బండితో ఉన్న నాగేశ్వరమ్మ భర్త చిన్నసుంకన్న గమనించి భార్యను ఆటోలో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. క్యాజువాలిటీలో వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ఆసుపత్రి ఆవరణలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. శాంతిప్రియ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మృతురాలి భర్త చిన్నసుంకన్న ఫిర్యాదు మేరకు ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement