కర్నూలు: కర్నూలులోని శ్రీరాం నగర్, ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ఇళ్లలో చోరీలకు పాల్పడి తప్పించుకుతిరుగుతున్న మహిళా దొంగను మూడో పట్టణ పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్టు చేసి కటకటాలకు పంపారు. కర్నూలు శ్రీరాం నగర్‌కు చెందిన దాసరి శిరీష, పెద్దమాల్ ప్రవీణ్ కుమార్ దంపతులు ఇంటికి తాళం వేసి ఈ ఏడాది మే 19వ తేదీన రాఘవేంద్రస్వామి దర్శనం నిమిత్తం మంత్రాలయం వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బెడ్‌రూమ్‌లోని డ్రెస్సింగ్ టేబుల్‌లో ఉంచిన 25 గ్రాముల బంగారు ఆభరణాలు మూటగట్టుకుని ఉడాయించారు. మరుసటి రోజు తిరిగి వచ్చిన దంపతులు ఇంట్లో చోరీ జరిగిందని నిర్ధారించుకుని మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. గురువారం నంద్యాల చెక్‌పోస్టు వద్ద అరుంధతి నగర్‌కు వెళ్లే రోడ్డులో టీవీ టవర్ వద్ద జెగ్గిలి నాగమల్లేశ్వరి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసు కుని విచారించగా ఆమె నేరాల చిట్టా బయటపడింది. సాయిబాబా సంజీవ య్య నగర్‌కు చెందిన ఈమె ప్రస్తుతం శ్రీరాం నగర్‌లో నివాసముంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన కూడా ఈమె ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలోని (గణేష్ నగర్2) నివాసముంటున్న బెస్త నాగరాజు ఇంట్లో కూడా చోరీకి పాల్పడినట్లు విచారణలో అంగీకరించింది. దీంతో ఆమె వద్ద నుంచి ఈ కేసుకు సంబంధించి కూడా బంగారు, వెండి ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తికి విక్రయించగా వచ్చిన నగదు రూ.55 వేలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శేషయ్య తెలిపారు. కేసుల దర్యాప్తులో ప్రతిభ కనపరచిన ఎస్‌ఐ చంద్రశేఖర్ రెడ్డితో పాటు క్రైం పార్టీ సిబ్బందిని సీఐ అభినందించారు. నిందితురాలిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు.


