నవ చేతన యాప్‌తో పిల్లల్లో లోపాల గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

నవ చేతన యాప్‌తో పిల్లల్లో లోపాల గుర్తింపు

Jun 4 2026 5:04 AM | Updated on Jun 4 2026 5:04 AM

కర్నూలు(సెంట్రల్‌): నవ చేతన యాప్‌తో ఏఐ ఆధారిత ఈసీడీ స్క్రీనింగ్‌ నిర్వహించి 0–6 సంవత్సరాల్లోపు చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదల లోపాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవ చేతన యాప్‌పై సీడీపీఓలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చిన్నారుల్లో సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సేవలు అందించాలనేది నవ చేతన యాప్‌ ఉద్దేశమన్నారు. జూన్‌ 5 నుంచి 10వ తేదీ వరకు మండల స్థాయిలో అంగన్‌వాడీ కార్యకర్తలకు యాప్‌ నిర్వహణపై శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యాప్‌లోని అంశాలపై సీడీపీఓలు, అంగన్‌వాడీలు పూర్తిగా అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ విజయ, వైద్యురాలు డాక్టర్‌ సృజనారెడ్డి, జిల్లా ప్రారంభ జోక్య కేంద్రం మేనేజర్‌ ఇర్ఫాన్‌ పాల్గొన్నారు.

ముగ్గురు సీనియర్‌ అకౌంటెంట్లకు పదోన్నతి

కర్నూలు(అగ్రికల్చర్‌): ఖజానా శాఖ ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్‌ అకౌంటెంట్లకు సబ్‌ ట్రెజరీ అధికారులు(ఎస్‌టీవో)గా పదోన్నతులు లభించాయి. రాష్ట్రం మొత్తం మీద ఆరుగురు సీనియర్‌ అకౌంటెంట్లకు పదోన్నతులు దక్కగా.. ఉమ్మడి జిల్లాలోనే ముగ్గురు ఉండటం విశేషం. పత్తికొండ సబ్‌ ట్రెజరీలో సీనియర్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శీలమ్మకు ఎమ్మిగనూరు సబ్‌ ట్రెజరీ అధికారిగా నియమించారు. కర్నూలు జిల్లా ట్రెజరీలో సీనియర్‌ అకౌంటెంటుగా పనిచేస్తున్న రవికుమార్‌ పదోన్నతిపై సత్యవేడు సబ్‌ ట్రెజరీకి బదిలీ అయ్యారు. నంద్యాల జిల్లా సబ్‌ ట్రెజరీలో సీనియర్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కమలాకర్‌ను పదోన్నతిపై తిరుపతికి బదిలీ చేశారు. ఈ మేరకు ఖజానా శాఖ డైరెక్టర్‌ పద్మజ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇళ్ల గణనకు జరగకపోతే ‘డయల్‌ 1855’

కర్నూలు(సెంట్రల్‌): జనగణన 2027లో భాగంగా మొదటి దశలో నిర్వహిస్తున్న ఇళ్ల జాబితా, ఇళ్ల గణన జూన్‌ 5వ తేదీన ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఏదైనా కారణంతో సర్వేకు రాకపోతే 1855 టోల్‌ఫ్రీ నెంబర్‌ లేదా సమీపంలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి బుధవారం ఒక ప్రకటనలో జిల్లా ప్రజలను కోరారు. దేశాభివృద్ధిలో కీలకమైన 2027 జనాభా గణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని, దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

సెలవుల్లో టీచర్లకు శిక్షణ

నేటి నుంచి 9వ తేదీ వరకు నిర్వహణ

కర్నూలు సిటీ: ప్రాథమిక విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. విద్యాశాఖలో ఉపాధ్యాయులకు విద్యా సంవత్సరంలో బోధనాంశాలపై శిక్షణ ఇవ్వడం పరిపాటి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాథమిక విద్యలో సమూల మార్పుల పేరిట గతంలో ఎప్పుడూ లేనంతగా వేసవి సెలవుల్లో హడావుడి చేస్తోంది. ఫండమెంటల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్‌) పేరుతో నేటి(గురువారం) నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇటీవలే జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు మాస్టర్‌ ట్రైనర్స్‌కి కీరిసోర్స్‌ పర్సన్స్‌ శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన ట్రైనర్స్‌ ఈ నెల 9వ తేది వరకు నాన్‌ రెసిడెన్షియల్‌ విధానంలో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలోని 7 కేంద్రాల్లో ఈ శిక్షణనిస్తారు. 1, 2 తరగతులు బోధన చేసే సెకండరీ స్కూల్‌ టీచర్లు, గతేడాది మెగా డీఎస్సీ ద్వారా నియామకమైన ఎస్‌జీటీలు మొత్తం 2,489 మంది శిక్షణ గురించి తెలుసుకునేందుకు మాడ్యూల్స్‌ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇంత వరకు జిల్లాలకు శిక్షణ మాడ్యూల్స్‌ రాకపోవడం గమనార్హం. శిక్షణకు జిల్లా వ్యాప్తంగా 7 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో టీచర్లకు సౌకర్యవంతంగా ఉండే ఏ కేంద్రానిౖకైనా హాజరు కావచ్చని సమగ్ర శిక్ష అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయానికి రూ.5 లక్షల విరాళం

బనగానపల్లె రూరల్‌: నందవరం చౌడేశ్వరిదేవి ఆలయ అభివృద్ధికి విజయవాడ పట్టణానికి చెందిన న్యూ ఎలక్ట్రిసీటి కాలనీ పటమటకు చెందిన శీలందేవి వివేకానంద, పద్మజ కుటుంబ సభ్యులు రూ.5.05 లక్షల విరాళాన్ని అందజేసినట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి బుధవారం తెలిపారు. రూ. 4,50,005 ఆలయ అభివృద్ధికి, మరో రూ.50 వేలు అన్నదానానికి విరాళంగా అందజేశారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement