కర్నూలు(హాస్పిటల్): ప్రాణాంతక, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు నొప్పి నివారణతో పాటు మానసిక ధైర్యాన్ని కల్పించడంలో పాలియేటివ్ కేర్ కీలక పాత్ర పోషిస్తోందని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ అన్నారు. బుధవారం స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో పాలియేటివ్ కేర్ సెన్సిటైజేషన్, శిక్షణ కార్యక్రమం జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్‌కే ప్రకాష్ మాట్లాడుతూ స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లోని పాలియేటివ్ కేర్ యూనిట్ నిరుపేద రోగులకు విశేష సేవలను అందిదిస్తోందన్నారు. ఈ కేంద్రానికి నార్కోటిక్ మందుల వినియోగానికి అవసరమైన లైసెన్స్ ఉండటంతో తీవ్ర నొప్పితో బాధపడుతున్న రోగులకు సమర్థవంతమైన చికిత్స సాధ్యమవుతోందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 3,500 నుంచి 4వేల మంది రోగులకు పాలియేటివ్ కేర్ సేవలను అందించామన్నారు. స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను నోడల్ కేంద్రంగా గుర్తించి అనంతపురం, హిందూపురం, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ఈనెల 2 నుంచి 6వ తేదీ వరకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కాలేజి ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీరాములు, అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎల్.భాస్కర్, అనెస్తీషియా హెచ్‌ఓడీ డాక్టర్ సుధీర్ పాల్గొన్నారు.


