హౌసింగ్‌ పీడీగా నరసింహారెడ్డి | - | Sakshi
Sakshi News home page

హౌసింగ్‌ పీడీగా నరసింహారెడ్డి

Jun 3 2026 12:57 AM | Updated on Jun 3 2026 12:57 AM

కర్నూలు(అర్బన్‌): జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌గా డ్వామా పీడీ ఐ.నరసింహారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు హౌసింగ్‌ పీడీగా విధులు నిర్వహించిన టి.చిరంజీవి మే 31న పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలోనే డ్వామా పీడీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.

గోస్పాడులో

41.6 డిగ్రీల ఉష్ణోగ్రత

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి జిల్లాలో ఉష్ణో గ్రతలు కొనసాగుతున్నాయి. మరోవైపు అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తున్నాయి. మంగళవారం నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. వానాకాలం మొదలైనా ఎండలు, వడగాలుల తీవ్రత కొనసాగుతోంది. గోస్పాడులో 41.6 డిగ్రీలు, పాణ్యంలో 41.5, శిరువెల్లలో 41.4, దొర్నిపాడులో 41.4, చాగలమర్రిలో 41.4, ఆళ్లగడ్డలో 41.3, అవుకులో 41.2, గడివేములలో 41.1, కొత్తపల్లిలో 41, ఓర్వకల్‌లో 40.6, కల్లూరులో 40.3, కౌతాళంలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

క్వింటా వేరుశనగ రూ.7,690

ఎమ్మిగనూరు టౌన్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం క్వింటా వేరుశనగ గరిష్టంగా రూ.7,690 పలికింది. మార్కెట్‌కు 90 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు విక్రయానికి వచ్చాయి. క్వింటా కనిష్ట ధర రూ.5,890, మధ్యస్థ ధర రూ.7,600 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్‌ యార్డ్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి.చంద్రమౌళి తెలిపారు.

ఎల్‌నినోతో దీర్ఘకాలం

బెట్ట పరిస్థితులు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఎల్‌నినో ప్రభావంతో పంట కాలంలో దీర్ఘకాలం బెట్ట పరిస్థితులు ఉంటాయని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్‌ వరలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తక్కువ వర్షపాతం వల్ల భూగర్భ జలాల స్థాయి గణనీయంగా పడిపోవచ్చని, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గుతాయన్నారు. వేడి గాలుల వల్ల నేలలోని తేమ ఆవిరై పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. పూత, కాయ రాలడం, తాలుగింజలు ఏర్పడతాయన్నారు. వ్యవసాయంపై ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఎర్రనేలల్లో జూన్‌, జూలై నెలల్లో వేరుశనగ, కందులు, ఆముదం, సజ్జలు, కొర్రలు, ఆముదం+కందులు, సజ్జలు+కందులు/వేరుశనగ, కొర్ర, కందులు+ కొర్ర వేసుకోవచ్చన్నారు. నల్లరేగడి నేలల్లో సజ్జలు, పత్తి, కందులు, పొద్దుతిరుగుడు, ఆముదాలు, ఆముదాలు+కందులు, సజ్జలు+కందులు వేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎర్ర నేలల్లో కనీసం 50 మి.మీ, నల్ల రేగడి నేలల్లో 75 మి.మీ వర్షపాతం నమోదైన తర్వాతనే విత్తనం వేసుకోవాలన్నారు.

కూల్‌డ్రింక్స్‌ దుకాణంలో తనిఖీలు

కర్నూలు(హాస్పిటల్‌): నగరంలోని మాధవనగర్‌లో ఉన్న ఈశ్వర్‌ కూల్‌డ్రింక్‌ దుకాణంలో మంగళవారం ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇ. రజనీకాంత్‌ అనే వ్యక్తి ఈ దుకాణంపై ప్రజా స్పందన పరిష్కార వేదికలో జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జేసీ ఆదేశాలతో ఫుడ్‌ సేఫ్టీ అధికారి రాజగోపాల్‌ దుకాణాన్ని తనిఖీ చేశారు. ఇందులో గత సంవత్సరం అక్టోబర్‌లో ఎక్స్‌పైర్‌ అయిన 24 థమ్స్‌ అప్‌ బాటిల్స్‌ను గుర్తించారు. అలాగే నన్నారి బాటిల్స్‌ను సైతం పరిశీలించారు. వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ల్యాబోరేటరికి పంపించారు. ఈ మేరకు సదరు దుకాణంపై కేసు నమోదు చేసినట్లు రాజగోపాల్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement