కర్నూలు సిటీ: ఈ ఏడాది జిల్లాలో చేపల ఉత్పత్తి పెంపునకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి మత్స్యశాఖ డీడీని ఆదేశించారు. మంగళవారం సుంకేసుల బ్యాకేజీ వద్ద చేపల విత్తనోత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కేంద్రంలోని మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి సామర్థ్యం, చేపల పెంపకానికి సంబంధించిన ఏర్పాట్లను డీడీని అడిగి తెలుసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చేపల విత్తనోత్పత్తి లక్ష్యాలను గణనీయంగా పెంచిన నేపథ్యంలో ఆ మేరకు చర్యలు చేపట్టాలన్నారు. సీడ్ ప్రొడక్షన్ సెంటర్ పరిధిలోని చెరువులలో పేరుకుపోయిన పూడిక తొలగింపు(జంగిల్ క్లియరెన్స్) పనులను చేపట్టాల్సిన అవసరాన్ని మత్స్యశాఖ డీడీ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్ పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. కలెక్టర్ వెంట కర్నూలు ఆర్డీఓ సందీప్‌కుమార్, మత్స్యశాఖ డీడీ రంగనాథ్ బాబు, కర్నూలు రూరల్ తహసీల్దారు టి.వి రమేష్ బాబు, తదితరులు ఉన్నారు.
ట్రావెల్స్ బస్సుపై రూ.5.77లక్షల జరిమానా
డోన్ టౌన్: వేరే నంబరుతో తిరుగుతున్న ట్రావెల్ బస్సుకు డోన్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్ సీజ్ చేసి రూ.5,77,040 జరిమానా విధించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం పట్టణానికి చెందిన వెంకటసాయి టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా.. నంబరు ప్లేట్‌పై మరో నంబర్ స్టిక్కరు అతికించి ఉంచడాన్ని గమనించారు. ఆన్‌లైన్‌లో తనిఖీ చేయగా ఆ బస్సుపై వైఎస్సార్ కడప జిల్లాలో గత సంవత్సరం 2025 ఆగస్టు నాటికి రూ. 4,14,250 లక్షలు జరిమానా బకాయిలుగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో బస్సును సీజ్ చేసి రవాణాశాఖ నిబంధనల ప్రకారం రూ.5,77,040 జరిమానా విధించి బస్సును ఆర్టీసీ డిపోకు తరలించారు.


