5న ఓర్వకల్‌లో విద్యుత్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

5న ఓర్వకల్‌లో విద్యుత్‌ అదాలత్‌

Jun 2 2026 5:41 AM | Updated on Jun 2 2026 5:41 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): విద్యుత్‌ వినియోగదారుల దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్‌పీడీసీఎల్‌ కర్నూలు డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ బి.రాజశేఖర్‌ తెలిపారు. ఈ నెల 5న ఓర్వకల్‌లోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ప్రాంగణంలో నిర్వహిస్తామని, విద్యుత్‌ అదాలత్‌లో రిటైర్డ్‌ జడ్జి శ్రీనివాస ఆంజనేయ మూర్తి, సాంకేతిక సభ్యులు శ్రీనివాసబాబు, స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి పాల్గొంటారని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కర్నూలు నగరం, కల్లూరు, క్రిష్ణగిరి, వెల్దుర్తి, కర్నూలు రూరల్‌, ఓర్వకల్‌ మండలాలకు చెందిన విద్యుత్‌ వినియోగదారులు సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. వినియోగదారులు తమ సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు.

అదనపు ఎస్పీగా బాబుప్రసాద్‌

కర్నూలు: కర్నూలు డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న బాబుప్రసాద్‌ ఇటీవల అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. సోమవారం క్యాంప్‌ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ను అదనపు ఎస్పీ హోదాలో మర్యాదపూర్వకంగా కలసి పూలమొక్కను అందజేశారు. ప్రస్తుతం కర్నూలు డీఎస్పీ స్థానంలోనే అటాచ్‌ విధుల కింద నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేయడంతో మరికొంత కాలం అదనపు ఎస్పీ హోదాలో అదే సీటులో కొనసాగనున్నారు.

అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి

కర్నూలు(సెంట్రల్‌): పీజీఆర్‌ఎస్‌లో వచ్చే అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె జేసీ నూరుల్‌ ఖమర్‌తో కలసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌ అర్జీలను సంతృప్త స్థాయిలో పరిష్కరించేందుకు నోడల్‌ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రీ ఆడిటింగ్‌ బృందాల ద్వారా అర్జీల పరిష్కారంలో నాణ్యతను పెంచాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ రామసుబ్బయ్య, సర్వే ఏడీ మురళీకృష్ణ, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి పాల్గొన్నారు.

జేఈఈ అడ్వాన్స్‌ ్డపరీక్ష ఫలితాలు విడుదల

కర్నూలు సిటీ: ఐఐటీల్లో బీటెక్‌, బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ సైన్స్‌, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో గత నెల 17న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌ ్డ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. పరీక్షలకు సుమారు 973 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల ఓఎంఆర్‌ గత నెల 21న వెబ్‌సైట్‌లో పెట్టి, 25వ తేది ప్రాథమిక కీ విడుదల చేసి, సోమవారం తుది కీ, ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో జిల్లాకు చెందిన ఎం.హర్షవర్ధన్‌ క్యాటగిరిలో 105వ ర్యాంకు, ఈ.అమృత 149వ ర్యాంకు, పి.ధర్మతేజ రెడ్డి 275, జి.ఉషాశ్రీ ఆల్‌ ఇండియా స్థాయిలో 563వ క్యాటగిరి ర్యాంకు, ఎల్‌.అను 631వ ర్యాంకు, ఎం.వరుణ్‌ 951వ క్యాటగిరి ర్యాంకు సాధించారు. నేటి (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు జోసా(జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ ఆథారిటీ–జేఓఎస్‌ఏఏ) కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది.

అటవీశాఖ స్క్వాడ్‌ ఎఫ్‌ఆర్‌ఓగా వెంకటశేషయ్య

కర్నూలు కల్చరల్‌: అటవీ శాఖలో పలువురు డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్లకు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్లుగా పదోన్నతులు కల్పిస్తూ పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆ శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ డాక్టర్‌ పి.వి.చలపతిరావు ఉత్తర్వులు జారీ చేశారు. కడప డివిజన్‌లో డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న కె.వెంకట శేషయ్యకు ఎఫ్‌ఆర్‌వోగా పదోన్నతి కల్పించి కర్నూలు డివిజన్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు పోస్టింగ్‌ ఇచ్చారు. డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ బి.లక్ష్మికుమారికి ఎఫ్‌ఆర్‌వోగా పదోన్నతి కల్పించి ప్రాజెక్ట్‌ టైగర్‌ ఆత్మకూరు డివిజన్‌ నాగలూటి రేంజ్‌కు పోస్టింగ్‌ ఇచ్చారు. డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ ఎస్‌.నాగేంద్రనాయక్‌కు ఎఫ్‌ఆర్‌ఓగా పదోన్నతి కల్పించి నంద్యాల డివిజన్‌ పాణ్యం రేంజ్‌కు పోస్టింగ్‌ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement