తీరం దాటిన దుఃఖం | - | Sakshi
Sakshi News home page

తీరం దాటిన దుఃఖం

Jun 1 2026 4:01 AM | Updated on Jun 1 2026 4:01 AM

కళ్లెదుటే కొట్టుకుపోయారు

మంత్రాలయం/మంత్రాలయం రూరల్‌: ఆశలు నిర్జీవమయ్యాయి.. తుంగభద్ర నదిలో గల్లంతైన వారందరూ మృత్యు ఒడికి చేరుకున్నారు. నది నుంచి ఒక్కొక్క మృతదేహాన్ని బయటకు తీసుకొస్తుంటే బంధువుల రోదనలు మిన్నంటాయి. మంత్రాలయంలోని ఓ ఇంట్లో సత్యనారాయణ వ్రతం పూజ నిమిత్తం వచ్చిన ఐదుగురు శనివారం తుంగభద్ర నదిలో స్నానాలకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. కాళప్ప ఆచారి కుమారుడు శశికుమార్‌ వివా హం సందర్భంగా ఆదివారం పౌర్ణమి రోజన ఇంట్లో సత్యనారాయణ వ్రత పూజ నిర్వహించాల్సి ఉంది. పూజ నిమిత్తం పలువురు బంధవులు శనివారమే మంత్రాలయానికి చేరుకున్నారు. సాయంకాలం కర్నూలులోని ఆదిత్య నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సతీష్‌(35) తన పెద్దకొడుకు యువన్‌చంద్ర(5)తో కలసి మరో నలుగురు కలసి తుంగభద్రా నదిలో పుణ్యస్నానానికి వెళ్లారు. అనంతపురం జిల్లా ఉరవకొండ రత్నయ్య ఆచారి కూతురు సంధ్య(21) (పెళ్ళికూతురు చెల్లెలు), ఎమ్మిగనూరుకు చెందిన వడ్ల ధనుష్‌ (22), మంత్రాలయానికి చెందిన వడ్ల రాఘవేంద్ర(25)తో పాటు ఆదోనికి చెందిన అపర్ణ(13)వెళ్లారు. చెంబు కోసం తుంగభద్ర నది లోకి వెళ్లిన యువన్‌ చంద్ర (5) గల్లంతయ్యాడు. కుమారుడిని కాపాడుకునేందుకు తండ్రి సతీష్‌, మిగతావారు నదిలోకి దిగారు. నీటి ప్రవాహం కారణంగా అందరూ గల్లంతయ్యారు. అందులో అపర్ణ మాత్రమే మృత్యుంజయురాలిగా ప్రాణాలతో బయటపడ్డారు.

మృతదేహాల లభ్యం

గల్లంతైన వారి ఆచూకీ కోసం రెండు రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం సాయకాలం ధనుష్‌ మృతదేహం మాత్రమే జాలర్లు గుర్తించారు. మిగతా నలుగురి ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం స్థానిక జాలర్లు నదిలో గాలించారు. ఉదయం 6 గంటల సమయంలో ఘటనా స్థలానికి కిలోమీటరు దూరంలోని తెల్లబండ్ల మడుగులో తండ్రి, కుమారుడు సతీష్‌,యువన్‌ చంద్ర మృతదేహాలు బయటపడ్డాయి. ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందం గాలిస్తుండగా తెల్లబండ్ల మడుగు దిగువ ప్రాంతంలో సంధ్య మృతదేహం లభించింది. రాఘవేంద్ర మృతదేహం ఘటనా స్థలం దగ్గరలోనే దొరికింది.

విషాదకరం

మృతుడు సతీష్‌.. గ్లోబుల్‌ ఆప్‌టాప్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. భర్త, సతీష్‌ , కుమారుడు యువన్‌చంద్ర చనిపోవడంతో ఝాన్సీరాణి కన్నీటి పర్యంతమయ్యారు. మృత్యురాలు సంధ్య బీటెక్‌ పూర్తి చేసుకుని జాబ్‌ కోసం యతిస్తున్నారు. పెళ్లి కూతురు చెల్లెలు అయిన ఈమె తల్లిదండ్రులకు ఆఖరి సంతానం. మంత్రాలయానికి చెందిన నరసింహాచారి రెండో కుమారుడైన రాఘవేంద్ర వంశపారపర్యంగా మారికాంబ, దేవమ్మ అవ్వ ఆలయ పూజారిగా పనిచేస్తున్నాడు. ఎమ్మిగనూరుకు చెందిన ధనుష్‌ బీటెక్‌ పూర్తి చేసుకుని జాబ్‌ కోసం యత్నిస్తున్నాడు.

మిన్నంటిన రోదనలు

గల్లంతైన వారి మృతదేహాలు లభ్యమవడంతో తుంగభద్ర నదీ తీరంలో బంధువుల రోదనలు మిన్నంటాయి. మృత శిశువు యువన్‌ చంద్ర భూజాన వేసుకుని తల్లి ఝాన్సీరాణి విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పెళ్లి కూమార్తె చెల్లెలు సంధ్య మృతదేహం లభించగానే ఇంటిల్లాపాది ఆర్తనాదాలు కలచి వేశాయి. అనుకోని దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు గాలిలో కలసి పోవడంతో మంత్రాలయం వాసులు అక్కడికి చేరుకుని అయ్యోపాపమంటూ కన్నీరుమున్నీరుయ్యారు. హృదయ విచారకర ఘటన పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

కుటుంబసభ్యులకు మృతదేహాల అప్పగింత

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మొత్తం 20 మంది ఎస్డీర్‌ఎఫ్‌ బృంద సభ్యులు, ఆరుగురుగజ ఈతగాళ్లు, స్థానిక మృత్స్యకారులు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. తహసీల్దార్‌ రమాదేవి, సీఐ దస్తగిరిబాబు, ఎస్‌ఐలు మల్లికార్జున, విజయ్‌కుమార్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌నాయక్‌, ఫైర్‌స్టేషన్‌ ఎస్‌ఐ రామాంజినేయులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సత్యానారాయణ వ్రతం నిమిత్తం బంధువుల ఇంటికి వచ్చాం. మధ్యాహ్నం మా పిల్లలకు యువన్‌ చంద్ర, తిరుధన్విక్‌కు రాఘవేంద్రస్వామి మఠంలో తలనీలాలు ఇచ్చాం. స్నానాలు చేసేందుకు తుంగభద్ర నది వద్దకు వెళ్లాం. అక్కడ మా పిల్లలు చెంబుతో ఆడుకుంటున్నారు. చెంబు నీటిలోకి పోగా మా పెద్దోడు నీళ్లలోకి దిగాడు. గమనించిన మా ఆయన సతీష్‌ బాబు కోసం నీటిలోకి దిగారు. అయితే అక్కడ లోతు ఎక్కవగా ఉండటంతో మా భర్త, బాబు రక్షించేందుకు తోటివారు దిగారు. అంతటితో ఐదుగురు పూర్తిగా కళ్లెదుటే మునిగిపోగా అపర్ణ మాత్రమే ప్రాణాలతో బయట పడింది. నదీ తీర ప్రాంతంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేక పోగా అప్రమత్తం చేసే నాథుడే లేడు. ఘటనా స్థలానికి జనాలు దూరంగా ఉండటంతో ఐదుగురిని కోల్పోవాల్సి వచ్చింది.

– ఝాన్సీరాణి, మృతుడు సతీష్‌ భార్య

పరామర్శ

తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతైన విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్య నిర్వాహక సభ్యులు, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు వై.సీతారామిరెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ జిల్లా కార్య దర్శి విశ్వనాథ్‌రెడ్డి, నాయకులు పరమేష్‌, వెంకటేశ్‌ శెట్టి, జనార్దన్‌రెడ్డి, పులికుక్క రాఘవేంద్ర, మల్లికార్జున, వీకేసీ రఘ, వడ్డే నారాయణ తదితరులు పాల్గొన్నారు.

తుంగభద్ర నదిలో

మృతదేహాల వెలికితీత

మిన్నంటిన బంధువు రోదనలు

ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రిలో

పోస్టు మార్టం

Advertisement
 
Advertisement
Advertisement