శ్రీమఠంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

శ్రీమఠంలో భక్తుల రద్దీ

Jun 1 2026 4:01 AM | Updated on Jun 1 2026 4:01 AM

మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. మూల బృందావన దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పట్టింది. రాయరు దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. వేసవి సెలవులు ఉండటంతో వేకువాజామున నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తుంగభద్ర నదీ తీరంలో భక్తుల కోలాహలం కనిపించింది.

ఎంపీడీఓలుగా

ఇద్దరికి పోస్టింగ్స్‌

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌/ మండల పరిషత్‌ కార్యాలయాల్లో పరిపాలనాధికారులుగా విధులు నిర్వహిస్తు ఇటీవలే ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన ఇద్దరికి ఆదివారం మండలాలు కేటాయిస్తూ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వులను అందించారు. జెడ్పీ ఏఓగా పనిచేస్తున్న కేవీ నాగేంద్రప్రసాద్‌ను ఎంపీడీఓగా మద్దికెరకు, ఆత్మకూరు మండల పరిషత్‌ కార్యాలయ ఏఓ సయ్యద్‌ ఉమర్‌ను హొళగుంద ఎంపీడీఓగా నియమించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు సేవలు అందించడంలో ఎంపీడీఓలు ముందుండాలని, పారదర్శకంగా విధులు నిర్వహించాలని కోరారు. జెడ్పీలోని చైర్మన్‌ చాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

ఇంటి వద్దే పింఛన్లు లేనట్లే!

కర్నూలు(అగ్రికల్చర్‌): ఇంటి దగ్గర పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంటున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జూన్‌ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. ప్రతి నెలా చాలా ఆలస్యం అవుతూ.. ఎండల తీవ్రతతో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐడీఆర్‌ఎస్‌ డేటా ప్రకారం సంతృప్తి రేటు చాలా తక్కువగా ఉండటంతో పెంచాలని ఇటీవలే ఉద్యోగులను జిల్లా అధికారులు ఆదేశించారు. జిల్లాకు జూన్‌ నెలకు సంబంధించి 2,34,764 పింఛన్లు ఉండగా వీటికి ప్రభుత్వం రూ.104.06 కోట్లు విడుదల చేసింది.

టీబీ డ్యాంకు తగ్గిన ఇన్‌ఫ్లో

హొళగుంద: కర్ణాటక హొస్పేట్‌ వద్ద నిర్మించిన తుంగభద్ర జలాశయానికి (టీబీ డ్యాం)కు ఇన్‌ఫ్లో తగ్గింది. గడిచిన పది రోజుల క్రితం అకాల వర్షాల కారణంగా డ్యాంకు వెయ్యి క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో మొదలైంది. వర్షాలు ఆగిపోవడంతో క్రమేణా తగ్గుతూ ఆదివారం 110 క్యూసెక్కులు మాత్రమే నమోదైంది. జలాశయంలో 10.128 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉండగా 289 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో ఉంది.

డిజిటల్‌ అరెస్టు పేరుతో వచ్చే కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలి

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు (టౌన్‌): డిజిటల్‌ అరెస్టు పేరుతో పోలీసులమని సైబర్‌ నేరగాళ్లు చేసే కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీబీఐ అధికారులమని, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులమని నటిస్తూ వీడియో కాల్స్‌ చేస్తూ కేసు నమోదైందని, గంజాయి, డ్రగ్స్‌ కేసుల్లో ఇరుక్కున్నారని ఫోన్లు వస్తాయన్నారు. అలాగే కొరియర్‌ వచ్చిందని అందులో డ్రగ్స్‌ ఉన్నాయని వచ్చే కాల్స్‌పై జాగ్రత్తగా ఉండాలన్నారు. పోలీసులు వీడియో, ఆడియో కాల్స్‌ చేయరని తెలిపారు. వీడియో కాల్‌ ద్వారా అరెస్టు గురించి సమాచారం చెప్పడం పోలీసు శాఖ పని కాదన్నారు. బ్యాంకు ఖాతా, ఆధార్‌ కార్డు, ఓటీపీ వివరాలు అధికారులు అడగబోరని తెలిపారు. ఇటువంటి ఫోన్‌ కాల్స్‌ వస్తే వాటిని బ్లాక్‌ చేయాలని, సమీప పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement