రజక విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

రజక విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

Jun 1 2026 4:01 AM | Updated on Jun 1 2026 4:01 AM

జూలై 15వ తేదీలోగా

దరఖాస్తు చేసుకోవాలి

కర్నూలు(అర్బన్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రజక విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించనున్నట్లు రజక విద్యా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సీపీ వెంకటేష్‌ తెలిపారు. కర్నూలులోని సమితి కార్యాలయంలో ఆదివారం ప్రతిభా పురస్కారాల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతిలో 450 మార్కులు, ఇంటర్‌లో 75 శాతం, డిగ్రీ, బీటెక్‌, పీజీ కోర్సుల్లో 75 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు జూ లై 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం రజక విద్యా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సీపీ వెంకటేష్‌ సెల్‌: 9110396511, 9959366426, 9550934626 నంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు సీ నరసింహులు, కోశాధికారి సిద్ద నాగేష్‌, సంయుక్త కార్యదర్శి వీరశేఖర్‌, నాయకులు మద్దూరు వెంకట్‌, మద్దూరు వెంకట నారాయణ, నాగేష్‌, దామగట్ల రమణ, మధు, న్యాయవాది జగదీష్‌ పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధికి విరాళం

బనగానపల్లె రూరల్‌: నందవరం గ్రామంలోని శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయ అభివృద్ధికి ఆదోనికి పట్టణానికి చెందిన పూడూరు రాఘవేంద్ర, పూడూరు వేణుగోపాల్‌ కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళాన్ని అందజేసినట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి ఆదివారం తెలిపారు. ఈ మేరకు దాత కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.

ట్రాక్టర్‌ డ్రైవర్‌ దుర్మరణం

రుద్రవరం: ట్రాక్టర్‌ అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో డ్రైవర్‌ దుర్మరణం చెందాడు. రుద్రవరం మండలం ఆర్‌.కొత్తూరు సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ జయప్ప తెలిపిన వివరాల మేరకు.. చందలూరుకు చెందిన పవన్‌ కుమార్‌రెడ్డి (30) కొన్నేళ్లుగా ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఆర్‌.కొత్తూరు సమీపంలో గల గంగిరెడ్డి కుంటలో నుంచి ట్రాక్టర్‌లో మట్టి తీసుకొచ్చేందుకు బయలుదేరాడు. రుద్రవరం–ఎర్రగుడిదిన్నె దారిలోని నాలుగు రోడ్ల కూడలి దాటి ముందుకు వెళ్లే సమయంలో ట్రాక్టర్‌ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌ ట్రాక్టర్‌ మీద నుంచి ఎగిరి కింద పడగానే ఆయనపై ట్రాక్టర్‌ టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు అవివాహితుడు. తల్లిదండ్రులు లేరు. ఓ సోదరుడు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

నేడు డయల్‌ యువర్‌ సీఎండీ, ఎస్‌ఈ

కర్నూలు(అగ్రికల్చర్‌): ఏపీఎస్‌పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్‌ యువర్‌ ఏపీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ ఆర్‌.ప్రదీప్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్‌ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్‌ భవన్‌లో కూడా సోమవారం డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు 7382614308 నంబరుకు ఫోన్‌చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.

క్వింటా వేరుశనగ రూ.8,100

ఎమ్మిగనూరుటౌన్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం క్వింటం వేరుశనగ గరిష్టంగా రూ.8,100 ధర పలికింది.మార్కెట్‌కు 143 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు విక్రయానికి వచ్చాయి. కనిష్ట ధర రూ.4,380, మధ్యస్థ ధర రూ.6,670 పలికినట్లు మార్కెట్‌ యార్డ్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. అలాగే 10 క్వింటాళ్ల కందులు మార్కెట్‌కు రాగా క్వింటం కనిష్ట ధర రూ.6,870, గరిష్ట ధర రూ,7,080 పలికినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement