కర్నూలు(టౌన్): గొడ్డలి పార్టీ అంటూ పైనుంచి కింది స్థాయి వరకు వైఎస్సార్‌సీపీపైనే ఏడ్వడమే పనిగా పెట్టుకున్నారని, టీడీపీ .. హంతక పార్టీ అని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుసుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి సూచించారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రౌడీలు, గుండాలతో అంబటి ఇంటిని ధ్వంసం చేశారని, పెట్రోలు బాంబులతో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని తగులబెట్టారన్నారు. నంద్యాలలో జెడ్పీటీసీ సభ్యుడు రమేష్‌ను నరికి చంపారని, ఆలూరులో ఈరన్న అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారన్నారు. కర్నూలులో సతీష్ ఆత్మహత్య వరకు ఎన్నో దుర్మార్గాలు చేశారన్నారు. మోహన రంగాను చంపిన చరిత్ర టీడీపీ కాదా అని ప్రశ్నించారు.
ఊరూరా బెల్ట్ షాపులు
కల్తీ మద్యం కేసులో టీడీపీకి చెందిన జయచంద్రారెడ్డి, మోలకల చెరువుకు చెందిన జనార్దనరావు జైళ్లకు వెళ్లారని ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు. టీడీపీ పాలనలో ఊరూరా బెల్ట్ షాపులు వెలిశాయని, కల్తీ మద్యం పారుతోందని విమర్శించారు. ఇటీవల లక్ష్మీపురంలోని బెల్ట్‌షాపులో మద్యం తాగి రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందితే బస్సు దగ్ధమై 19 మంది కాలిబూడిద అయ్యాయన్నారు. డ్రగ్స్ సేవిస్తూ టీడీపీకి చెందిన పార్లమెంటు సభ్యులు పుట్టామహేష్ పట్టుబడలేదా అని ప్రశ్నించారు. పోలీసులు వస్తే వారిపై కాల్పులు జరిగిన ఘనత టీడీపీ నాయకులకే చెందుతుందన్నారు.
‘మహా’మోసం
హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకే మహానాడు నిర్వహిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. మామను వెన్ను పోటు పొడిచిన పార్టీ టీడీపీ కాదా అని ఎస్వీ ప్రశ్నించారు. రెండేళ్లు దాటుతున్నా మహిళలకు రూ.1,500 ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారన్నారు. నిరుద్యోగులకు రూ. 3 వేలు, 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రూ. 4వేల పింఛన్ ఇవ్వకుండా మోసం చేశారన్నారు. ప్రతి సంవత్సరం మూడు సిలిండర్ల ప్రకారం రెండేళ్లలో ఆరు సిలిండర్లు ఇవ్వకుండా రెండు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. మెగా డీఎస్సీని కాస్తా దగా డీఎస్సీగా మార్చిన ఘనత టీడీపీది కాదా అని ప్రశ్నించారు.
సంక్షేమం.. వైఎస్సార్‌సీపీ సొంతం
అధికారంలో ఉన్న సమయంలో జగనన్న అన్ని వర్గాలకు చెప్పిన ప్రతి హామీ అమలు చేశారన్నారు. అవినీతిని గొడ్డలితో నరికి ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా రూ.2.76 లక్షల కోట్లు సంక్షేమ పథకాల పేరుతో నేరుగా ప్రజల బ్యాంక్ అకౌంట్లలోనే జమ చేశారన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించారని, ప్రతి గ్రా మంలో సచివాలయాలను ఏర్పాటు చేసి అక్క డే పదిమంది ఉద్యోగులను నియమించారన్నారు. అభివృద్ధి, సంక్షేమం వైఎస్సార్‌సీపీ సొంతం అయ్యిందన్నారు.
నంద్యాలలో జెడ్పీటీసీ సభ్యుడిని
నరికి చంపారు
ఆలూరులో ఈరన్న అనే వ్యక్తిని
హత్య చేశారు
మోహన రంగాను చంపిన
చరిత్ర ఎవరిది?
వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా
అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి


