నేడు పశుసంవర్థక శాఖ జేడీ పదవీ విరమణ | - | Sakshi
Sakshi News home page

నేడు పశుసంవర్థక శాఖ జేడీ పదవీ విరమణ

May 30 2026 2:56 AM | Updated on May 30 2026 2:56 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుబ్బదాసు శనివారం పదవీ విరమణ చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా పనిచేస్తున్న ఆయనకు ప్రభుత్వం జాయింట్‌ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించి కర్నూలు జిల్లాకు బదిలీ చేసింది. ఈ నెల 23న పదవీ బాధ్యతలు స్వీకరించారు. సెలవులను మినహాయిస్తే ఆరు రోజులు మాత్రమే జేడీ హోదాలో పనిచేశారు. పదవీ విరమణ కార్యక్రమాన్ని శనివారం కొండారెడ్డి బురుజు సమీపంలోని బహుళార్ధ పశువైద్యశాల ప్రాంగణంలో నిర్వహించనున్నారు. జేడీగా పనిచేస్తున్న సుబ్బదాసు పదవీ విమరణ చేస్తుండటంతో ఆయన స్థానంలో బహుళార్ధ పశువైద్యశాల డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ హేమంత్‌కుమార్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వ్యక్తిని రక్షించిన హోంగార్డులు

తుగ్గలి: ఆత్మహత్యయత్నానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని హోంగార్డులు రక్షించారు. ఎస్‌ఐ నరేష్‌ తెలిపిన వివరాల మేరకు.. పత్తికొండకు చెందిన నారాయణరెడ్డి కుటుంబ సమస్యల నేపథ్యంలో మానసిక ఒత్తిడితో తుగ్గలి రైల్వే ట్రాక్‌పై నిల్చుని డోన్‌ నుంచి గుంతకల్లు వైపు వెళ్లే రైలు కిందపడి చనిపోతున్నాని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశాడు. వారు వెంటనే తుగ్గలి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ నరేష్‌ అందుబాటులో ఉన్న హోంగార్డులను అప్రమత్తం చేశారు. హోంగార్డులు రంగస్వామి, లక్ష్మానాయక్‌ హుటాహుటిన వెళ్లి ట్రాక్‌పై ఉన్న బాధితున్ని రక్షించి కౌన్సిలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాణాలు కాపాడిన ఎస్‌ఐ, హోంగార్డులకు నారాయణరెడ్డి కుంటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. హోంగార్డులను ఎస్‌ఐ నరేష్‌, పత్తికొండ రూరల్‌ సీఐ పులిశేఖర్‌, పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement