కర్నూలు(సెంట్రల్)/కౌతాళం: కర్ణాటక నుంచి అక్రమంగా పెట్రోలు, డీజిల్ తెచ్చి కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుందలో అధిక ధరతో విక్రయాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు డీఎస్‌ఓ రాజారఘువీర్ తెలిపారు. వీరి నుంచి 1,060 లీటర్ల డీజిల్, 150 లీటర్ల పెట్రోల్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ముందస్తు సమాచారం మేరకు ఉరుకుందలో రెండు షాపుల్లో దాడులు చేయగా అక్రమ పెట్రోలు, డీజిల్ విక్రయాలను గుర్తించామన్నారు. కర్ణాటక నుంచి పెట్రో ఉత్పత్తులను తెచ్చి విక్రయించడం చట్టపరంగా నేరమని, ఇలా చేయడం వల్ల రాష్ట్రానికి జీఎస్‌టీ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుందన్నారు. స్క్వాడ్ బృందంలో ఆదోని సీఎస్‌డీటీ రుద్రగౌడు, కౌతాళం మండల ఆర్‌ఐ తిక్కస్వామి, వీఆర్వో శివానంద ఉన్నారు.


