వెల్దుర్తి: బ్రహ్మగుండం క్షేత్రంలో అమ్మవారి, రాములోరి గుళ్ల తలుపులు నెల రోజులుగా తెరుచుకోవడంలేదు. బ్రహ్మగుండేశ్వరుడి గర్భగుడి పక్కనే కామేశ్వరీదేవి అమ్మవారి గర్భగుడి ఉంది. ఆలయం ఎదురుగా రాములోరి గుడి ఉంది. ఈ ఏడాది శివరాత్రికి ముందు కామేశ్వరీ దేవి గుడి పూజారి శ్రీధర్ శర్మ రాజీనామా చేయడంతో అధికారులు, గ్రామ పెద్దలు కర్నూలుకు చెందిన ఫణిశర్మకు బాధ్యతలు అప్పజెప్పారు. అప్పటికే అనాదిగా రాములవారి గుడికి పూజారి లేక, తలుపులు తెరుచుకోక భక్తులు పడుతున్న ఇబ్బందులను ఈ ఏడాది ఫిబ్రవరి 16న ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అధికారులు ఫణిశర్మకు రాములవారి గుడి బాధ్యతలు సైతం అప్పజెప్పారు. అయితే అమ్మవారి, రాములోరి రెండు గుళ్ల పూజారి అయిప ఫణిశర్మ గత నెల రోజులుగా విధులకు హాజరుకాకపోతుండడంతో ఆయా గుళ్ల తలుపులకు తాళాలు వేసి ఉండి, స్వామి, అమ్మవార్లకు నైవేద్యం సైతం అందడంలేదు. భక్తులకు దర్శనభాగ్యం కలగడం లేదు.


