ఆదోని అర్బన్: పత్తికొండ, ఆదోని ప్రాంతాల్లో బైక్‌లను అపహరించిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. దొంగ నుంచి రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం సీఐ రాజశేఖర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో దొంగ వివరాలను వెల్లడించారు. ఆదోని పట్టణంలోని లక్ష్మమ్మవ్వ ఆర్చ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో అనుమానాస్పదంగా బైక్‌పై వస్తున్న హానవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31)ను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు గతంలో ఆదోని వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, ఆదోని తాలూకా, పత్తికొండ, వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో మొత్తం పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగలించినట్లు ఒప్పుకున్నాడు. అతని సమాచారం మేరకు ఆదోని–ఆస్పరి రహదారిలో బైపాస్ రోడ్డులో రహస్య ప్రదేశంలో దాచిన రూ.10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.


