నందికొట్కూరు: శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను కుప్పానికి తరలించామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ముంపు బాధితులు గుర్తుకు రాకపోవడం తగదని నీటిముంపు నిరుద్యోగ సంఘం నాయకులు జయన్న ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారి పక్కన శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారానికి 64వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా జయన్న మాట్లాడుతూ నీటిముంపు బాధితులకు 98 జీవో ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 40 ఏళ్లయినా కాలయాపన చేస్తూనే ఉన్నారన్నారు. ఇప్పటికై నా ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని కోరారు. దీక్షల్లో బాధితులు రామకృష్ణ, నాగేంద్రుడు, జమ్మన్న, నారాయణ, మౌలాలి, శివశంకర్, రాజేష్, రంగయ్య తదితరులు కూర్చున్నారు.


