గుండెపోటుతో ప్రయాణికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ప్రయాణికుడి మృతి

May 29 2026 2:19 AM | Updated on May 29 2026 2:19 AM

కొలిమిగుండ్ల: మండల కేంద్రం కొలిమిగుండ్ల ప్రధాన రహదారిలో గురువారం గుండెపోటుతో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. అవుకు మండలం చెర్లోపల్లెకు చెందిన దేవభూషణం (55)కు అనారోగ్యంగా ఉండటంతో ఉదయం ఒక్కడే వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు వైద్యశాలకు వెళ్లాడు. పరీక్షలు చేయించుకొని మందులు తీసుకొని కొలిమిగుండ్ల బస్టాండ్‌కు చేరుకున్నాడు. స్వగ్రామమైన చెర్లోపల్లెకు వెళ్లేందుకు ప్రధాన రహదారిలోనే తోటి ప్రయాణిలకులతో కలిసి బనగానపల్లె డిపో బస్సు ఎక్కేందుకు వెళుతున్న క్రమంలో గుండెపోటు రావడంతో కుప్పకూలి పోయాడు. స్థానికులు పరీక్షించి చూడగా అప్పటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని బోరున విలపించారు.

వేధింపులు తాళలేక వివాహిత మృతి

దేవనకొండ: అదనపు కట్నం కోసం అత్తారింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. బేతపల్లి గ్రామానికి చెందిన కోతింటి సుధాకర్‌తో కోడుమూరు మండలం ఎర్రదొడ్డి గ్రామానికి చెందిన ఐశ్వర్య(20)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి అయిన నాటి నుంచి సుధాకర్‌ కుటుంబ సభ్యులు ఐశ్వర్యని మానసికంగా, అదనపు కట్నం కోసం వేధించడంతో ఈనెల 26వ తేదీన ఇంట్లో ఉరేసుకుని మృతిచెందింది. మృతురాలి తండ్రి అలువాల వనుములన్న ఫిర్యాదు మేరకు భర్త సుధాకర్‌తో పాటు మామ కోతింటి శివరాముడు, అత్త శరణావతి, మరిది సురేష్‌లపై కేసు నమోదు చేసినట్లు దేవనకొండ పోలీసులు తెలిపారు. మృతురాలికి 8 నెలల కుమారుడు ఉన్నారు.

30న జాతీయ స్థాయి నాటక పోటీలు

ఆదోని అర్బన్‌: పట్టణంలో ఈనెల 30, 31వ తేదీల్లో జాతీయ స్థాయి నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు లలిత కళాసేవ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ జి.నల్లారెడ్డి, డి.చిట్టిబాబు తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ నైతిక విలువలు, సామాజిక స్పృహను దృష్టిలో ఉంచుకుని నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంలో హరికథలు, బుర్రకథలు తోలు బొమ్మలాటల ద్వారా పురాణ, ఇతిహాస పాత్రలను, వారి వ్యక్తిత్వాలను తెలుసుకుని ఆప్యాయతలు, అనురాగాలు ఉండేవని, నేడు కళలు కనుమరుగవడంతో అనుబంధాలు కూడా బలహీనపడ్డాయన్నారు. శివరాములు, రాయుడు, రవి ప్రకాష్‌, రంగన్న, నరసింహులు పాల్గొన్నారు.

50 మంది

బీఎల్‌ఓల నియామకం

కర్నూలు (టౌన్‌): కర్నూలు నియోజకవర్గ పరిధిలో ఖాళీగా ఉన్న బీఎల్‌ఓల స్థానంలో నగరపాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు కొత్త వారిని నియమించారు. మెడికల్‌ లీవ్‌, స్టడీలీవ్‌, అనారోగ్య కారణాలు, ప్రమోషన్‌, డిప్యూటేషన్‌ తదితర కారణాలతో ఖాళీగా ఉన్న పోలింగ్‌ కేంద్రాలకు మరో 50 మందిని కమిషనర్‌ నియమించి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నియమించిన బీఎల్‌ఓలు స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆయన ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement