ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్‌

May 28 2026 2:04 AM | Updated on May 28 2026 2:04 AM

దాడులు ముమ్మరం చేస్తాం

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో యథేచ్ఛగా స్కానింగ్‌ కేంద్రాల్లో గర్భస్థ లింగనిర్ధారణ చేస్తున్నా చర్యలు ఉండటం లేదు. డెకాయిట్‌ ఆపరేషన్‌ చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కార్యాలయం కదలడం లేదు. కొందరు కదిలినా స్కానింగ్‌ కేంద్రాల వైద్యులు, నిర్వాహకులు ఇచ్చే సొమ్ముతో చర్యలు తీసుకోకుండా తిరిగి వచ్చేస్తున్నారు. గత పదిహేనేళ్లుగా జిల్లాలో ఒక్క స్కానింగ్‌ కేంద్రం కూడా చర్యలు తీసుకోలేదంటే అతిశయోక్తి కాదు. 2024 ఏప్రిల్‌లో వైద్యుల బృందం 40 స్కానింగ్‌ కేంద్రాల పరిశీలనకు వెళ్లి అక్కడి రికార్డులు, రిపోర్టులు, మిషన్లు, వైద్యుల వివరాలు, గర్భిణుల వివరాలు పరిశీలించింది. అయితే అన్ని చోట్లా సక్రమంగా ఉన్నాయని నివేదికలు ఇవ్వడం విశేషం. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్‌లో రెండు, కొత్తబస్టాండ్‌ వద్ద నాలుగు, ఎన్‌ఆర్‌ పేటలో

రెండు, కోడుమూరు, గూడూరులోని ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాల్లో గర్భస్థ శిశువు లింగనిర్ధారణ, అబార్షన్లు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం

అవుతున్నాయి.

ఆర్‌ఎంపీలే సూత్రధారులు

జిల్లాలోని ఆదోని, పత్తికొండ, కోసిగి, పెద్దతుంబళం, పత్తికొండ, క్రిష్ణగిరి, డోన్‌, మంత్రాలయం, గోనెగండ్ల, కౌతాళం నుంచి అనేక మంది గర్భిణులు స్కానింగ్‌, అబార్షన్ల కోసం ఆసుపత్రులకు వస్తున్నారు. ఇలాంటి వారిని స్థానిక ఆర్‌ఎంపీలు దగ్గరుండి మరీ ప్రత్యేక ఆసుపత్రులను తీసుకొచ్చి స్కానింగ్‌, ఆపై అబార్షన్లు చేయిస్తున్నారు. లింగనిర్ధారణ చేయాలంటే రూ.5వేలు, ఆపై అబార్షన్‌ చేయాలంటే రూ.20వేల నుంచి రూ.30వేలు వసూలు చేస్తున్నారు. గర్భిణిని తీసుకొచ్చిన వైద్యులకు 30 నుంచి 40 శాతం వరకు కమీషన్లు ముట్టజెబుతున్నారు.

నిరక్షరాస్యత, పేదరికమే శాపం

ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉన్న జిల్లాల్లో కర్నూలు ముందుంటుంది. దీనికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని ప్రజలు అధికంగా నిరక్షరాస్యులు, పేదలు కావడమే. పశ్చిమ ప్రాంతంలోని పల్లెల్లోని ప్రజలు అధికంగా స్థానికంగా పనులు లేక వలసలు వెళ్తున్నారు. ఇలా వెళ్లే సమయంలో ఎదిగిన ఆడపిల్లలను ఇంటి వద్ద వదిలేయలేక వారు రజస్వల కాగానే టీనేజీలోనే వివాహం చేసేస్తున్నారు. ఈ కారణంగానే టీనేజీ గర్భిణుల సంఖ్య సైతం జిల్లాలో అధికంగా ఉంటోంది. నిర్లక్షరాస్యత కారణంగా ఆడపిల్లలకు రక్షణ ఉండదని, ఎక్కువగా ఆడపిల్లలను కనకూడదని, కంటే అత్తామామలతో ఇబ్బంది అనే భయంతో చాలా మంది కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలియగానే అబార్షన్‌ చేయిస్తున్నారు.

చట్టం ఉన్నా చెత్తబుట్టలోకే!

అబార్షన్‌(భ్రూణహత్యలు) నివారణకు కేంద్ర ప్రభుత్వం 1994లో ఏపీ పీసీ పీఎన్‌డీటీ అనే పటిష్టమైన చట్టం చేసింది. స్కానింగ్‌ కేంద్రాల్లో లింగనిర్ధారణ చేసినా, అబార్షన్లు చేసినా ఈ చట్టం ప్రకారం ఇరువర్గాలను శిక్షార్షులు అవుతారు. మొదటిసారి తప్పు చేస్తే మూడేళ్లు జైలు, రూ.10వేల జరిమానా, రెండోసారి తప్పు చేస్తే ఐదేళ్లు జైలు, రూ.50వేల జరిమానా విధిస్తారు. స్కానింగ్‌ కేంద్రం, అబార్షన్‌ చేసిన సదరు వైద్యుల పేరును భారత వైద్యవిధాన మండలి నుంచి తాత్కాలికంగా, కొన్నిసార్లు శాశ్వతంగా తొలగిస్తారు. అయితే జిల్లాలో ఈ చట్టం ప్రకారం ఒక్కరిపై కూడా కేసు నమోదుకాకపోవడం గమనార్హం. ఈ చట్టం గురించి ఆయా స్కానింగ్‌ కేంద్రాల్లో ప్రకటనలు ప్రచురించి ఉంటాయి గానీ కొన్ని కేంద్రాల్లో ఉల్లంఘనలు జరుగుతున్నాయి.

లింగనిర్ధారణ చేసే కేంద్రాలపై దృష్టి పెట్టనున్నాం. వాటిపై త్వరలో దాడులు ముమ్మరం చేయనున్నాం. ఆయా స్కానింగ్‌ కేంద్రాల గురించి ఎవ్వరైనా ఫిర్యాదు చేస్తే వారి పేరు, వివరాలు బహిర్గతం కాకుండా చేసి, సదరు స్కానింగ్‌ కేంద్రంపై దాడులు చేస్తాం. ఇకపై రెగ్యులర్‌గా ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాలపై దాడులు ముమ్మరం చేస్తాం. లింగనిర్ధారణ, అబార్షన్లు చేసే ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటాం.

–డాక్టర్‌ వై.కామేశ్వరప్రసాద్‌, డీఎంహెచ్‌వో, కర్నూలు

సంతానం లేక ఎంతో మంది డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. దేవాలయాలకు, ప్రార్థనా మందిరాలకు వెళ్లి తమ ఇష్ట దైవానికి మొక్కుకుంటున్నారు.

కొందరికి ఏడాదికి, మరికొందరి రెండు, మూడేళ్లకు బిడ్డ జన్మిస్తే ఇంకొందరికి పది, పదిహేనేళ్లయినా సంతానం కలగని పరిస్థితి. అయితే కొందరు కడుపులో బిడ్డ పడగానే అందులో ఉన్నది ఆడబిడ్డ అని తెలియగానే నిర్దాక్షిణ్యంగా కడుపులోనే చిదిమేస్తున్నారు. ఫలితంగా జిల్లాలో ఆడపిల్లల శాతం గణనీయంగా పడిపోతోంది.

గర్భంలోనే తుదముట్టిస్తున్నారు

జిల్లాలో యథేచ్చగా భ్రూణ హత్యలు

అధికమైన అబార్షన్‌లు

స్కానింగ్‌ సెంటర్లపై నిఘా శూన్యం

తూతూ మంత్రంగా తనిఖీలు

జిల్లాలో 260 అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య మరో 40 నుంచి 50 వరకు ఉండే అవకాశం ఉంది. వీటికి జిల్లా కమిటీ పరిశీలించి అనుమతులు జారీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గర్భిణులకు స్కానింగ్‌ చేసి చాలా కేంద్రాల్లో గర్భస్థ శిశువు ఆరోగ్యం గురించి వివరిస్తున్నారు. అయితే ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న కొందరు మాత్రం గర్భంలో ఉన్నది ఎవరో నిర్భయంగా చెప్పేస్తున్నారు. ఇందుకోసం గర్భిణుల నుంచి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా కర్నూలు నగరంతో పాటు ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు, గూడూరులలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లలో ఇలాంటి స్కానింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వైద్యులు చెప్పిన దానిని బట్టి గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే కొందరు అబార్షన్‌ చేయించుకుంటూ కనబోయే బిడ్డను కడుపులోనే చంపేస్తున్నారు. ఇలా అబార్షన్‌ చేసిన గర్భస్థ శిశువును పూడ్చి పెట్టకుండా చెత్తకుప్పల్లో కొందరు పారేస్తున్నారు. ఇలా పారేసిన మృతశిశువులను కుక్కలు తింటూ ఉన్న దృశ్యాలు అప్పుడప్పుడూ జిల్లాలో కనిపిస్తూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement