పత్తికొండ: చదువుకునే ఖైదీల కోసం పత్తికొండ సబ్‌జైలులో గ్రంథాలయం ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. స్థానిక సబ్‌జైలును బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిమాండ్‌లో ఉన్న ముద్దాయిలతో మాట్లాడారు. రిమాండ్‌లో ఉండి, న్యాయవాదిని నియమించుకునే అర్థిక స్తోమత లేనివారికి న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో ఉచితంగా న్యాయసేవలు అందిస్తామని తెలిపారు. ఖైదీలపై సిబ్బంది మానవత్వంతో ప్రవర్తించాలని సూచించారు. కోర్టు సిబ్బంది రాజశేఖర్, రాఘవేంద్ర, ప్రభుత్వ వైద్యుడు సత్యనారాయణ, న్యాయవాదులు సూరజ్‌నబీ, హరికృష్ణా ఆచారి తదితరులు పాల్గొన్నారు.
5వేల ఎకరాల్లో పండ్లతోటల అభివృద్ధి లక్ష్యం
కర్నూలు(అగ్రికల్చర్): 2026–27 సంవత్సరంలో వీబీ జి రామ్ జి కింద 5వేల ఎకరాల్లో పండ్లతోటల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు సుస్థిర ఆస్తులు కల్పించాలనే లక్ష్యంతో 100 శాతం సబ్సిడీతో పండ్లతోటల సాగుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ జాబ్‌కార్డు కలిగి ఐదు ఎకరాల్లోపు భూములున్న సన్న, చిన్నకారు రైతులందరూ అర్హులేనన్నారు. ఆసక్తి కలిగిన రైతులు సంబంధిత పీల్డ్ అసిస్టెంట్ లేదా సాంకేతిక సహాయకులు, ఏపీవో, ఎంపీడీవోలను సంప్రదించవచ్చన్నారు.
17 మండలాల్లో వర్షాలు
● మంత్రాలయంలో
48.2 మి.మీ వర్షపాతం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని వివిధ మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం 4 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఉదయం 11 గంటల వరకు జల్లులు పడ్డాయి. 17 మండలాల్లో వర్షపాతం నమోదైంది. మంత్రాలయంలో అత్యధికంగా 48.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆదోనిలో 36.2, సి.బెళగల్‌లో 31.2, ఎమ్మిగనూరులో 30.2, కౌతాళంలో 26.8, పెద్దకడుబూరులో 24.8, కోసిగిలో 20.6, నందవరంలో 16.8, గోనెగండ్లలో 15.4 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తంగా సగటున 11 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ నెల 26 వరకు ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. తాజాగా పలు మండలాల్లో వర్షాలు పడటంతో వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల లోపే నమోదయ్యాయి. ఆదోనిలో 28.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఎంఐడీహెచ్ కింద జిల్లాకు రూ.11.40 కోట్లు
● ఆర్‌కేవీవై కింద
రూ.1.09 కోట్లు కేటాయింపు
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యాన సమగ్ర అభివృద్ధి మిషన్(ఎంఐడీహెచ్) కింద జిల్లాకు ప్రభుత్వం రూ.11.40 కోట్లు కేటాయించినట్లు జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త తోటల విస్తరణకు అర్హులైన రైతుల ఎంపిక జరుగుతోందన్నారు. అదేవిధంగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్‌కేవీవై) కింద రూ.1.09 కోట్లు మంజూరయ్యాయన్నారు. జిల్లాలో శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన 13 మండలాల్లో 327.63 హెక్టార్లలో 100 శాతం సబ్సిడీతో ఆయిల్‌పామ్ మొక్కలు అందించామన్నారు. సాగు, నిర్వహణ, అంతర పంటల సాగుకు నాలుగేళ్ల పాటు హెక్టారుకు 50 శాతం రాయితీపై రూ.5,250 అందిస్తామన్నారు.
డీసీసీబీ సీఈఓ పోస్టు నుంచి తప్పుకున్న శివలీల
● జనరల్ మేనేజర్ రామాంజనేయులుకు
ఇన్‌చార్జి బాధ్యతలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ)గా పనిచేస్తున్న శివలీల ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. వ్యక్తిగత కారణాలతో ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చైర్మన్ డి.విష్ణువర్ధన్‌రెడ్డికి మంగళవారం ఆమె రాతపూర్వకంగా రాసిచ్చారు. శివలీల సీఈఓగా మార్చి మొదటి వారంలో బాధ్యతలు స్వీకరించారు. తర్వాత 20 రోజుల పాటు సెలవుల్లో ఉన్నారు. సెలవుల నుంచి తిరిగి వచ్చిన తర్వాత సీఇవో పోస్టును వ్యక్తిగత కారణాలతో వదులుకుంటున్నట్లు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈమె వినతిని చైర్మన్ ఆమోదించారు. వెంటనే డీసీసీబీలో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న పి.రామాంజనేయులును ఇన్‌చార్జి సీఈఓగా నియమించారు. సీఈఓ పోస్టు నుంచి తప్పుకున్న శివలీల జనరల్ మేనేజర్‌గా కొనసాగనున్నారు.


