ఆదోని అర్బన్: గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బుధవారం ఆయన పట్టణ శివారు ఆలూరు రోడ్డులోని చెక్‌పోస్టును, సిరుగుప్ప జంక్షన్ ప్రధాన చెక్ పోస్టులను పరిశీలించారు. పట్టణంలో బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులతో త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు, గూడూరు, పత్తికొండ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. కర్నూలు పట్టణ శివారులో 8 చెక్ పోస్టులు, ఆదోని పట్టణ శివారులో 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు నిరంతర తనిఖీలు చేపడుతున్నారన్నారు. గోవుల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎస్పీ వెంట ఆదోని ఇన్‌చార్జి డీఎస్పీ భార్గవి, స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసూదన్‌రావు, పట్టణ సీఐలు చంద్రశేఖర్, రాజశేఖర్‌రెడ్డి, రామలింగమయ్య, ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.


