తుగ్గలి : మండలంలోని చెన్నంపల్లి–రామలింగాయపల్లి మధ్యనున్న రైల్వే ట్రాక్ సమీపంలో పశ్చిమబెంగాల్ వాసి అనూప్‌మాలిక్ (34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డోన్ రైల్వే ఎస్‌ఐ బిందు మాధవి తెలిపిన వివరాల మేరకు.. రైల్వే ట్రాక్ పక్కనున్న విద్యుత్ పోల్‌కు గుర్తు తెలియని వ్యక్తి లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారన్న సమాచారం అందింది. ఘటనాస్థలానికి చేరుకుని మృతుడి వద్ద లభ్యమైన ఆధారాల ప్రకారం అనూప్ మాలిక్ పశ్చిమబెంగాల్‌వాసిగా గుర్తించాం. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య విడి పోవడంతో అనూప్ ఇక్కడి వచ్చి కూలీ పనులు చేస్తుండేవారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్య సమాచారాన్ని కుటుంబ సభ్యులు చేరవేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఉపాధి కూలీకి పాముకాటు
కోవెలకుంట్ల: స్థానిక మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన ఉపాధి కూలీ బుధవారం పాముకాటుకు గురైంది. కోవెలకుంట్లకు చెందిన శిరీష ఇతర కూలీలతో కలిసి పట్టణ శివారులోని గుంజలపాడు రహదారిలో ఎస్సార్బీసీలో పూడిక తొలగింపు పనులకు వెళ్లింది. పనులు చేస్తున్న సమయంలో కాల్వలోని లైనింగ్‌లో దాగి ఉన్న పాము కాటు వేయగా అస్వస్థతకు గురైంది. తోటి కూలీలు చికిత్స నిమిత్తం ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. పాముకాటుకు గురైన శిరీషను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవా లని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా, మండల కార్యదర్శులు సుధాకర్, రాములమ్మ డిమాండ్ చేశారు.
కోలుకోలేక వీఆర్‌ఓ మృతి
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– నంద్యాల ఆర్‌అండ్‌బీ రహదారిలో మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వీఆర్‌ఓ బుధవారం మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. మండలంలోని కలుగొట్లకు చెందిన గుండాల పెద్దపుల్లయ్య (54) ఇదే మండలంలోని రేవనూరు వీఆర్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 25వ తేదీన విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళుతుండగా పట్టణ శివారులోని పెట్రోల్ బంకు వద్ద ప్రమాదశాత్తు బైక్‌పై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య విజయకుమారి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేడు ట్రాఫిక్ మళ్లింపు
కర్నూలు: బక్రీద్ పండుగను పురస్కరించు కుని కర్నూలు నగరంలో గురువారం ఉదయం 6 గంటల నుంచి ప్రార్థనలు ముగిసే వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందని ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దిన్ తెలిపారు. హైదరాబాద్ వైపు నుంచి కర్నూలుకు వచ్చే ఆర్టీసీ బస్సులను కర్నూలు నగరంలోకి అనుమతించకుండా తిప్పమ్మ కొట్టం నుంచి నేషనల్ హైవే మీదుగా బస్టాండ్‌కు వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్ ఔట్‌గేట్ నుంచి బయలుదేరే బస్సులను బళ్లారి చౌరస్తా, గుత్తి పెట్రోల్ బంకు, బిర్లా జంక్షన్, సి.క్యాంప్ సర్కిల్ మీదుగా నంద్యాల చెక్‌పోస్టు వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల చెక్‌పోస్టు వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు సి.క్యాంప్ రైతుబజార్ మసీదు వద్ద నుంచి బిర్లా జంక్షన్ గుత్తి పెట్రోల్ బంకు మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపు నేపథ్యంలో ప్రజలు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సీఐ విజ్ఞప్తి చేశారు.
కర్నూలు (సెంట్రల్) : ఒక నెల ఒక నియోజకవర్గం, నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి శుక్రవారం ఓర్వకల్లు మండల కేంద్రంలో ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ను నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సిరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ జీవేశ్వరస్వామి దేవస్థాన కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులు హాజరై వినతులు స్వీకరిస్తారని, ఈ అవకాశాన్ని కల్లూరు, ఓర్వకల్లు మండలాలు, కర్నూలు నగరంలోని కల్లూరుకు చెందిన 16 వార్డుల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


