కర్నూలు : తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన అబ్దుల్ మతిన్, నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామానికి చెందిన దేవరశెట్టి శివకృష్ణ వృతిరీత్య డ్రైవర్లు. వీరు అద్దె కారులో వస్తారు. తాళాలు వేసిన ఇళ్ల వద్ద రాత్రి రెక్కి నిర్వహించి చోరీలకు పాల్పడుతారు. తర్వాత హైదరాబాద్‌కు వెళ్లి జల్సా చేస్తారు. నిఘావేసిన కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు ఆ ఇద్దరి అంతర్రాష్ట్ర దొంగలను వలపన్ని పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు. కేసు వివరాల్లోకి వెళితే.. కర్నూలు నగరం ఉద్యోగ నగర్‌లో నివాసముండే తెలుగు చిన్నరంగడు కుటుంబ సమేతంగా ఇంటికి తాళం వేసి కేదార్‌నాథ్‌కు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు గత నెల 21వ తేదీన ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో దాచుకున్న 13 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు మూటగట్టుకుని ఉడాయించారు. బాధితుడు చిన్న రంగడు ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అంతర్‌రాష్ట్ర దొంగలుగా పోలీసు రికార్డులకెక్కిన అబ్దుల్ మతిన్, దేవరశెట్టి శివకృష్ణ ఈ నేరాలకు పాల్పడినట్లు పక్కా ఆధారాలు చిక్కాయి. మంగళవారం రాత్రి కర్నూలు మండలం మునగాలపాడు గ్రామ శివారులో వారిద్దరూ ఉన్నట్లు సమాచారం అందడంతో అదుపులోకి తీసుకుని విచారించగా వారి నేరాల చిట్టా వెలుగు చూసింది. అబ్దుల్ మతిన్ మహబూబ్ నగర్, జడ్చర్ల, హైదరాబాద్, సదాశివ పేట ప్రాంతాల్లో, దేవరశెట్టి శివకృష్ణ జడ్చర్ల, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడి పోలీసు రికార్డులకు ఎక్కారు.
జల్సాలకు అలవాటు పడి..
అబ్దుల్ మతిన్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. మొదట్లో సంగారెడ్డి ఐఐటీలో ట్రాన్స్‌పోర్టు సూపర్‌వైజర్‌గా పనిచేసేవాడు. ఐఐటీ పక్కన ఉన్న ఐస్ ఫ్యాక్టరీకి తరచూ దేవరశెట్టి శివకృష్ణ డ్రైవర్‌గా వెళ్లేవాడు. అక్కడే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కలసి మద్యం సేవించడం, పేకాట, బెట్టింగ్ వంటి వాటికి అలవాటుపడ్డారు. ఈ క్రమంలోనే అబ్దుల్ మతిన్ సూపర్‌వైజర్ ఉద్యోగం ఊడింది. దీంతో స్వగ్రామం సదాశివపేట సర్పంచుకు డ్రైవర్‌గా కుదిరాడు. కొంతకాలానికి వివాహేతర సంబంధం విషయంలో సర్పంచుతో గొడవ పడి కత్తితో పొడవటంతో హత్యాయత్నం కేసు నమోదైంది. అదే సమయంలో మద్యం మత్తులో మైనర్ బాలికపై కూడా అఘాయిత్యానికి పాల్పడినందుకు పోక్సో కేసు నమోదై రెండోసారి కూడా జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చాక దేవరశెట్టి శివకృష్ణతో కలసి పలు చోట్ల ఇళ్ల దొంగతనాలకు పాల్పడ్డారు. వృత్తి రీత్యా ఇద్దరూ డ్రైవర్లు అయినందున కారు అద్దెకు తీసుకుని రాత్రివేళల్లో తాళాలు వేసిన ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించి దొంగతనాలకు పాల్పడి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుని జల్సాలు చేసేవారు. ఈ క్రమంలో దేవరశెట్టి శివకృష్ణకు కుమారుడు జన్మించడంతో కలసి పార్టీ చేసుకునేందుకు హైదరాబాదు నుంచి ఇద్దరూ కారు తీసుకుని కర్నూలుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఉద్యోగ నగర్‌లో తెలుగు చిన్నరంగడు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. పక్కా ఆధారాలతో ఇరువురినీ అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. విలాసవంతమైన జీవితానికి అప్పులు చేయడం, వాటిని తీర్చే క్రమంలో ఇరువురు దొంగలుగా మారారని సీఐ విక్రమసింహ తెలిపారు. చోరీకి గురైన బంగారు ఆభరణాలను వీరి నుంచి రికవరీ చేయాల్సి ఉందని తెలిపారు. కేసు ఛేదించడంలో ప్రతిభ కనపరచిన ఎస్‌ఐ గోపీనాథ్, సిబ్బంది సుబ్బరాయుడు, మురళి తదితరులను సీఐ అభినందించారు.


