మాలలను అణచివేస్తున్న కూటమి ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

మాలలను అణచివేస్తున్న కూటమి ప్రభుత్వం

May 27 2026 6:20 AM | Updated on May 27 2026 6:20 AM

మాలల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే చైతన్యయాత్ర

10 లక్షల మందితో విజయవాడలో మాలల సింహగర్జన

మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావ్‌

కర్నూలు(అర్బన్‌): రాష్ట్రంలో మాలలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూటమి ప్రభుత్వం అణచివేస్తుందని మాల మహాసభ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావ్‌ తీవ్రంగా ఆరోపించారు. అన్ని విధాల నష్టాలను చవి చూస్తున్న మాలల్లో చైతన్యం నింపేందుకు హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ‘మాలల ఐక్యతా చైతన్య యాత్ర ’ను చేపట్టినట్లు చెప్పారు. యాత్రలో భాగంగా మంగళవారరం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ మాల సంక్షేమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్రలో మాల మహాసభ, మాల మహానాడు, మాల సంఘాల జేఏసీ, అంబేడ్కర్‌ యువజన సంఘాలు సంయుక్తంగా పాల్గొంటున్నాయన్నారు. రాష్ట్రంలోని మాల ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందన్నారు. కలెక్టర్‌, ఎస్పీ, ఆర్‌డీఓ, డీఎస్పీ తదితర ఉన్నత స్థానాల్లో పనిచేసేందుకు మాల అధికారులకు అర్హత ఉన్నా నియమించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పదోన్నతుల విషయంలో కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే ఏసీబీతో సహా పలు రకాల కేసులను పెడుతు సస్పెన్షన్లకు గురి చేస్తున్నారన్నారు. గ్రామాల్లో కూడా మాల కులస్తులపై, చర్చీలపై ఇటీవల కాలంలో దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో విద్యా పరంగా కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. నేటికి ఫీజు రీయంబర్స్‌మెంట్‌ నిధులు విడుదల కాలేదన్నారు. మాలలకు అన్ని విధాల న్యాయం చేస్తామని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన హామీలు నేటికి నెరవేరలేదన్నారు. ముఖ్యంగా రాజ్యాంగ వ్యతిరేక వర్గీకరణ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. మాలల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా 10 లక్షల మందితో విజయవాడలో అగస్టు నెలలో మాలల సింహగర్జన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గంగాధర్‌, మాల సంఘాల జేఏసీ అధ్యక్షుడు చెరుకూరి అశోకరత్నం, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోన నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement