ముద్దాయిలు అరెస్ట్ రిమాండ్‌కు తరలింపు
పత్తికొండ/హొళగుంద: మొత్తం ఆస్తి తమకు దక్కాలని హరిజన గాదిలింగప్ప మొదటి భార్య పిల్లలు ఎల్లమ్మను హత్య చేసినట్లు పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. మంగళవారం పత్తికొండ పట్టణంలోని తన కార్యాలయంలో ఆలూరు, ఆస్పరి సీఐలు రవిశంకర్‌రెడ్డి, శ్రీనువాసులునాయక్‌లతో కలిసి డీఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు.
హొళగుంద మండలం సులువాయి గ్రామానికి చెందిన హరిజన గాదిలింగప్పకు మల్లమ్మ, ఎల్లమ్మ అనే ఇద్దరు భార్యలు. గాదిలింగప్ప తనకున్న 4.50ఎకరాలు భూమిని వారిద్దరికి సమానంగా పంచాలని నిర్ణయించి కుటుంబసభ్యులకు తెలియజేశాడు. మొదటి భార్య హరిజన మల్లమ్మ, కుమారులు హరిజన శేకన్న, చిన్న గాదిలింగ అందుకు ఒప్పుకోలేదు.
ఈ విషయంలో గ్రామంలో పెద్దల వద్ద పంచాయితీ జరిగింది. ఎలాగైనా తమ తండ్రి రెండో భార్యకు సగం ఆస్తి ఇస్తాడని, ఆమెను అంతమొందిస్తే మొత్తం తమకే దక్కుతుందని భావించి హత్యకు పథకం రచించారు. ఈనెల 21వ తేది అర్ధరాత్రి ఇంట్లో నిద్రపోతున్న ఎల్లమ్మను విచక్షణారహితంగా కొడవలితో తల, మెడ భాగాలపై నరికి చంపేశారు.
విషయం తెలుసుకున్న హతురాలి కూతురు గుండమ్మ అక్కడికి చేరుకొని జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం సాయంత్రం హరిజన శేకన్న, హరిజన మల్లమ్మ, హరిజన చిన్న గాదిలింగను ఆలూరు నుంచి ఎల్లార్తికి వెళ్లే రహదారిలో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను పత్తికొండ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు డీఎస్పీ వెల్లడించారు.


