కర్నూలు: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం షాంలి జిల్లాకు చెందిన భవారియా గ్యాంగ్ జిల్లాలో తిష్ట వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈనెల 9వ తేదీ రాత్రి గుత్తి పెట్రోల్ బంకు సమీపంలో ఇద్దరు దుండగులు చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డారు. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో సంతోష్ నగర్‌లో ఓ మహిళ వద్ద ఉంచి చైన్ స్నాచింగ్‌కు పాల్పడి పారిపోతుండగా ఆమె కొడుకు, మనవడు అప్రమత్తమై దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో దుండగుల వాహనం అదుపు తప్పి కింద పడి అక్కడి నుంచి పారిపోయారు. సంఘటనా స్థలంలో దొరికిన బైక్, కీప్యాడ్ ఫోన్, బ్యాగులను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. టెక్నికల్ ఆధారాలతో దొంగలు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని షాంలి జిల్లాకు చెందిన భవారియా గ్యాంగ్ సభ్యులుగా తేలింది. వరుస చోరీలకు పాల్పడిన సభ్యులు మానవ్, హరిప్రకాష్‌లుగా గుర్తించారు. మానవ్‌ని మంగళవారం బాలాజీ నగర్ వద్ద అరెస్టు చేసి దొంగిలించిన చైన్‌లోని రెండు గ్రాముల ముక్కను సీజ్ చేసి పోలీసులు రిమాండ్‌కు పంపారు. మరొక దొంగ హరి ప్రకాష్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ తెలిపారు. మానవ్, హరి ప్రకా ష్‌లపై హరియానా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లలో 15కు పైగా దొంగతనం కేసులు ఉన్నాయి. వీరిద్దరూ ఈనెల 7వ తేదీ బెంగళూరుకు వచ్చి అక్కడి నుంచి అనంతపురం చేరుకున్నారు. పట్టణంలో ఓ పల్సర్ బైక్ దొంగిలించుకుని కర్నూలుకు వచ్చి వరుసగా రెండు చోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాల చిట్టా బయటపడింది.
మరొకరి కోసం గాలింపు


