శాంతికి భంగం కలిగిస్తే జిల్లా బహిష్కరణ
కర్నూలు: ప్రజా శాంతికి భంగం కలిగించే వారిపై జిల్లా బహిష్కరణ, పీడీ యాక్ట్ నమోదుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో బుధవారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించే బాధితుల ఫిర్యాదులపై సత్వరమే స్పందించి న్యాయం చేస్తేనే పోలీసు శాఖకు మంచి పేరు వస్తుందన్నారు. పోక్సో కేసులలో కచ్చితంగా నిర్దేశించిన సమయంలోపే చార్జిషీటు వేయాలన్నారు. డీజీపీ చేపట్టిన ‘వజ్ర ప్రహర్’ కార్యక్రమంలో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేస్తూ రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి సబ్ డివిజన్ పరిధిలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టాలని, డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ చేయించాలన్నారు. సైబర్ బాధితులు రూ.లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నట్లు ఫిర్యాదులు వస్తే సైబర్ క్రైం కింద వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా మాట్లాడుతూ గస్తీ తిరిగే పోలీసులు రాత్రి వేళల్లో రేడియం జాకెట్లు, ఎల్‌ఈడీ బ్యాటన్స్ ధరించాలన్నారు. గత నెలలో వివిధ కేసుల్లో ప్రతిభ కనపరచిన పోలీసు అధికారులు, సిబ్బందికి, డీపీఓ మినిస్టీరియల్ సిబ్బందికి ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు బాబుప్రసాద్, వెంకటరామయ్య, ఉపేంద్రబాబు, హేమలత, భార్గవి, డీపీఓ ఏఓ విజయలక్ష్మి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.


