ఆధార్‌ చూపించాలి..ఓటీపీ చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

ఆధార్‌ చూపించాలి..ఓటీపీ చెప్పాలి

Feb 26 2026 8:37 AM | Updated on Feb 26 2026 8:37 AM

ఆధార్‌ చూపించాలి..ఓటీపీ చెప్పాలి

ఆధార్‌ చూపించాలి..ఓటీపీ చెప్పాలి

కర్నూలు(అగ్రికల్చర్‌): కష్టపడి పండించిన పంటలు అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడాల్సి వస్తుంది. ఇప్పటికే గిట్టుబాటు ధర లభించక నష్టాల పాలవుతున్న రైతన్నలకు కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఈ –నామ్‌ 2.0 వర్షన్‌ మరింత తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు ఈ–నామ్‌ 2.1 వర్షన్‌ కింద రైతుల వివరాలు నమోదు చేసుకోవడం జరిగేది. ఈ వర్షన్‌ మంగళవారం రాత్రి క్లోజ్‌ అయింది. తాజాగా ఈ–నామ్‌ 2.0 నందు వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ చేసిన తర్వాతనే వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌ లోపలికి అనుమతిస్తారు. కనీస సమాచారం లేకుండా కొత్త వర్షన్‌ అమలు చేయడంపై రైతులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వర్షన్‌ మారడంతో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్‌ యార్డుల్లో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. మార్కెట్‌కు వచ్చే రైతులు సాధారణంగా ఆధార్‌ కార్డు తెచ్చుకోరు. అనేక మంది రైతుల దగ్గర మొబైల్‌ ఫోన్లు కూడా ఉండవు. ఇక నుంచి మార్కెట్‌ యార్డుల్లో పంటలను అమ్ముకోవాలంటే రైతులు విధిగా ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ పాసుపుస్తకం నకళ్లు, మొబైల్‌ ఫోన్‌ వెంట తెచ్చుకోవాలి. మార్కెట్‌ ఎంట్రీ గేటులోనే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఆధార్‌ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం కాపీలు ఇవ్వాల్సి ఉంది.

ఓటీపీ నెంబరు చెప్పాల్సిందే..

ఈనామ్‌ కొత్త వర్షన్‌లో ఫోన్‌ నంబరు కూడా చెప్పాలి. వివరాలు నమోదు చేసిన తర్వాత రైతు మొబైల్‌కు ఓటీపీ నంబరు వస్తుంది. ఓటీపీ నెంబరు చెబితేనే రైతు వివరాలు రిజస్టర్‌ అవుతాయి. అయితే రైతులు తమ వెంట ఆధార్‌ తెచ్చుకోకపోవడం, కొంతమంది తెచ్చుకున్నా.. ఓటీపీ నెంబరు చెబితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనన్న భయంతో ఆధార్‌, బ్యాంకు పాసుపుస్తకం ఇవ్వడానికి, ఓటీపీ నెంబరు చెప్పేందుకు ఇష్టపడలేదు. వర్షన్‌ మారడంతో రిజిస్ట్రేషన్‌లు ముందుకు సాగ లేదు. సైబర్‌ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఓటీపీ నెంబర్లు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఈ–నామ్‌ 2.0 వర్షన్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. ఆధార్‌ ఇవ్వం.. ఓటీపీ చెప్పేదిలేదని భీష్మించారు. కొత్త వర్షన్‌కు రైతులు సహకరించకపోవడంతో బుధవారం కర్నూలు వ్యవసాయ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మాన్యువల్‌గా ఈ–నామ్‌ అమలుకు ముందున్న విధానం ప్రకారం క్రయవిక్రయాలు జరిగాయి. ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఓటీపీ లేకుండానే రిజిస్ట్రేషన్‌ చేపట్టి వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు చేపట్టారు. కాగా.. ఈ–నామ్‌ వర్షన్‌ మారినందున మార్కెట్‌ యార్డుల్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్ముకునేందుకు వచ్చే రైతులు విధిగా వెంటనే ఆధార్‌, బ్యాంకు పాసుపుస్తకం నకళ్లు, మొబైల్‌ ఫోన్‌ వెంట తెచ్చుకోవాలని కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ తర్వాతనే వ్యవసాయ ఉత్పత్తులను లోపలికి అనుమతిస్తారని స్పష్టం చేశారు.

ఉన్నట్టుండి ఈ–నామ్‌ వర్షన్‌

మార్పు చేసిన కేంద్రం

ఇంతవరకు ఈ–నామ్‌ 2.1 వర్షన్‌ కింద

వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు

తాజాగా 2.0 వర్షన్‌ కింద

ప్రతి రోజు రైతుల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

వెంట ఆధార్‌, బ్యాంకు పాసు బుక్‌తో

పాటు మొబైల్‌ ఫోన్‌ తెచ్చుకోవాల్సిందే

ఆందోళనలో అన్నదాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement