అంగన్‌వాడీల ఉద్యమ భేరి
● మార్చి 2న చలో విజయవాడ
కర్నూలు(సెంట్రల్): అంగన్‌వాడీల వేతనాలు, ఐసీడీఎస్ బడ్జెట్‌ను పెంచాలని ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.వెంకటమ్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ, గౌరవాధ్యక్షురాలు పి.నిర్మల చెప్పారు. ఆదివారం సీఐటీయూ కార్యాలయంలో జరిగిన యూనియన్ సమావేశంలో వారు మాట్లాడారు. మార్చి 2వ తేదీన జరిగే చలో విజయవాడను జయప్రదం చేయాలన్నారు. అంతకు ముందు ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ప్రాజెక్టుల్లో నిరసనలు, 25, 26 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
దళితులకు
‘ఉపాధి’ కరువు
వెల్దుర్తి: తమకు ఉపాధి పనులు కల్పించాలని కోరుతూ దళిత మహిళలు ఆదివారం కృష్ణాపురం గ్రామంలో జాబ్‌కార్డులు చూపుతూ నిరసన తెలిపారు. మేటి ద్వారా పనులు కల్పించుకునేందుకు తాము ఏడాదిగా ప్రయత్నిస్తున్నా ఎలాంటి ఫలితం రాలేదన్నారు. వెల్దుర్తిలోని ఉపాధి కార్యాలయానికి వెళ్లినా, అధికారులను కోరినా పనులు కల్పిస్తామంటూనే కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వలసలు వెళ్లలేక, పస్తులు గడపలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వంద మంది దళితులకు ఉపాధి పనులు కల్పించాలని కోరారు.
నేడు న్యాయవాదుల విధుల బహిష్కరణ
కర్నూలు (టౌన్): న్యాయవాది పవన్‌పై కర్నూలు నాలుగవ పట్టణ సీఐ విక్రమ సింహాదాడికి నిరసనగా సోమవారం జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు విధులను బహిష్కరిస్తున్నట్లు జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. కర్నూలులోని కోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల అత్యవసర సమావేశం ఆదివారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. సోమవారం న్యాయవాదులంతా కలిసి ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తున్నట్లు తెలిపారు. సీఐపై కేసు నమోదు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. స్పందించకుంటే భవిష్యత్తు కార్యచరణ రూపొందిస్తామన్నారు.


