క్రైస్తవ సమాధుల జోలికి వస్తే ఉద్యమిస్తాం
● రియల్టర్లకు అండగా ఉన్న
టీడీపీ నేతల ఇళ్లను ముట్టడిస్తాం
● క్రైస్తవ సంఘాల ఐక్య వేదిక నాయకులు
కర్నూలు (టౌన్): కర్నూలు నగర శివారులోని సుంకేసుల రోడ్డులో ఉన్న క్రైస్తవ సమాధుల స్థలాలను కబ్జా చేస్తున్నారని, వాటి జోలికి వస్తే ఉద్యమిస్తామని క్రైస్తవ సంఘాల ఐక్య వేదిక నాయకుడు జాషువా దానియేలు, వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ విల్సన్‌పాల్ అన్నారు. సుంకేసుల రోడ్డులో ఉన్న పాత క్రైస్తవ సమాధుల తోటను పక్కనే ఉన్న వెంచర్‌కు సంబంధించిన వ్యక్తులు 100కు పైగా సమాధులను శనివారం తొలగించారు. అంతేకాకుండా రహదారిని సైతం ఏర్పాటు చేసుకున్నారు. విషయం తెలియడంతో కర్నూలు లోని క్రైస్తవులు, వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రోడ్డుపై భైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆక్రమణకు పాల్పడిన ప్రాంతంలో అప్పటికప్పుడే రాళ్లు తరలించి రక్షణ గోడ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రైస్తవుల సమాధులను తొలగించి వెంచర్ యజమానులు ఆక్రమణలకు పాల్పడటం, వారికి టీడీపీలోని ముఖ్య నేతలు వంత పాడటం సిగ్గు చేటన్నారు. అధికారులు తక్షణం స్పందించి విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమాధుల స్థలానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రియల్టర్లకు అండగా ఉన్న టీడీపీనేతల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే క్రైస్తవులందరూ సమాధుల తోట వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. సీసీ సంఘం పాస్టర్లు అనిల్ శ్యామూల్ డేవిడ్, సిరిగిరి జీవన్ కుమార్, ఐక్య వేదిక నాయకులు తాళ్లురి జయప్రకాష్, జెట్టి ప్రభుదాస్, కర్నూలు ఫీల్డ్ నాయకులు ఎస్. జయకాంత్, స్టాంటన్ చర్చి పాస్టర్ గంటా విజయసాగర్, వైఎస్సార్‌సీపీ నాయకులు గద్ద రాజశేఖర్, లీగల్ సెల్‌నాయకులు రాజేష్ కుమార్ పాల్గొన్నారు.
క్రైస్తవ సమాధుల జోలికి వస్తే ఉద్యమిస్తాం


