న్యాయవాదిపై సీఐ దాడి | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదిపై సీఐ దాడి

Feb 22 2026 7:06 AM | Updated on Feb 22 2026 7:06 AM

న్యాయవాదిపై సీఐ దాడి

న్యాయవాదిపై సీఐ దాడి

కేసు నుంచి తప్పించుకునేందుకే ఆరోపణలు

● జిల్లా ఎస్పీకి ఫిర్యాదు.. ఆసుపత్రిలో చికిత్స

కర్నూలు(సిటీ): ఓ కేసు విషయంలో పోలీసుస్టేషన్‌కు వెళ్లిన తనపై సీఐ విక్రమసింహ దాడి చేసినట్లు అడ్వకేట్‌ ఎం.పవన్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తమ కుమారుడిని గంజాయి కేసులో అరెస్టు చేసి స్టేషన్‌లో పెట్టారని అతని తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ మేరకు కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐ విక్రమ సింహను కలువగా పరుశ పదజాలంతో దూషిస్తూ భయపెట్టాడు. నువ్వు ఇంతకు ముందు క్రైం నెం.389/2025లో ఎ8, ఎ9 ముద్దాయిలకు యాంటిసిపేటరీ బెయిల్‌ ఎందుకు వేశావు. ముద్దాయిలను మాకు పట్టించమని చెప్పాను కదా.. అయినా నువ్వు మాకు సహకరించలేదని సీఐ బెదిరించారు. ఎ9 ముద్దాయిని కాకుండా తాము రిమాండ్‌ చేసిన ముద్దాయి వేర్వేరని కోర్టుకు ఎందుకు తెలియజేశావు? అని పరుష పదజాలంతో దూషించారు. మీ అడ్వకేట్స్‌ వల్ల మా పోలీసులకు ఎలాంటి ఆదాయం లేదు. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకో అన్నారు. సీఐ ఛాంబర్‌ నుంచి లేచి వస్తుండగా అక్కడే ఉన్న క్రైం పార్టీ కానిస్టేబుల్‌ మురళిని డోర్‌ లాక్‌ చేయమని సీఐ చెప్పడంతో అతను డోర్‌ లాక్‌ చేశాడు. ఇంతలో సీఐ తన షర్టు పట్టుకుని ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ నా తలను గోడకేసి బలంగా కొట్టాడు. ఆ తర్వాత సీఐ కాళ్లు మొక్కించుకుని స్టేషన్‌ నుంచి బయటకు పంపించారు. అనంతరం హాస్పిటల్‌కు వెళ్లి ఎంఎల్‌సీ చేయించి దెబ్బలకు చికిత్స చేయించుకున్నా. దాడి విషయాన్ని కర్నూలు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు హరినాథ్‌ చౌదరి దృష్టికి తీసుకెళ్లా.’ అన్నారు. ఇదిలాఉంటే జరిగిన దాడిపై పవన్‌కుమార్‌ జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌కు వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. తక్షణమే సీఐ విక్రమ సింహపై చర్యలు తీసుకోవాలని కోరారు. అడ్వకేట్‌పై జరిగిన దాడికి నిరసనగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిసింది.

అడ్వకేట్‌ పవన్‌కుమార్‌పై మా స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది. దాని నుంచి బయటపడేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ముద్దాయిల నుంచి డబ్బు తీసుకుంటున్నావని స్టేషన్‌లో మా సిబ్బంది ముందు నన్ను ప్రశ్నించారు. ఏదైనా ఉంటే నిరూపించాలి కానీ, అలా ఆరోపించడం తప్పని వారించానే తప్ప దాడికి పాల్పడలేదు. – విక్రమసింహ, సీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement