వాహనదారులు వ్యక్తిగత భద్రత పాటించాలి
కర్నూలు: ప్రతి వాహనదారుడు వ్యక్తిగత భద్రతతో పాటు రోడ్డు భద్రతా నియమాలను తప్పకుండా పాటించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. రాత్రివేళల్లో అధిక శబ్ధం వచ్చే విధంగా సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో బైక్‌లు, ఆటోలపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 100 బైక్ సైలెన్సర్లు, 500 ఆటోల హారన్లను సీజ్ చేశారు. నెల రోజుల స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడిన బైక్ సైలెన్సర్లు, ఆటో హారన్లను శనివారం జిల్లా పోలీసు కార్యాలయం కొండారెడ్డిబురుజు దగ్గర రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. కార్యక్రమానికి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ మోటార్ వాహన చట్టం ప్రకారం అనుమతి లేని మార్పులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల కింద ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అధునాతన పరికరాలను సమకూరుస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. డిజిటల్ ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డుతో పాటు 66 సోలార్ రెడ్ బ్లింకింగ్ స్టడ్స్, 4 అధునాతన మూవబుల్ బారికేడ్స్‌ను దాతలు ట్రాఫిక్ పోలీసులకు అందజేయగా వాటిని ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలు కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం, గోల్డ్ షాప్ ప్రభాకర్, డీఈ ఫణికుమార్‌లకు ఎస్పీ జ్ఞాపికలను అందజేసి అభినందించారు. అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీ బాబుప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసూదన్‌రావు, ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


