పేదలందరికీ ఉచిత న్యాయ సహాయం
● శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్
వెంకట హరినాథ్
కర్నూలు(సెంట్రల్): సమాజంలో ఆర్థింగా వెనుకబడిన ప్రతి ఒక్కరికీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ తెలిపారు. ఆదివారం జిల్లా కోర్టులోని న్యాయ సదన్‌లో జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..1987లో రూపొందించిన లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్‌ను 1995 నవంబర్ 9వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చారన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39ఏ ప్రకారం ఆర్థిక, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించాలన్నారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామ్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్‌కౌన్సిల్ ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద మాట్లాడుతూ..మహిళా శిశు సంక్షేమ శాఖ, లీగల్ సర్వీసెస్ సంయుక్తంగా మహిళలు, పిల్లలకు, ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కర్నూలు మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ అనురాధ, ప్యానెల్ లాయర్లు, న్యాయ విద్యార్థులు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.


