
అభిమానం.. సజీవం!
● కర్నూలు నగరంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక ఎస్వీ కాంప్లెక్స్ నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు ప్రదర్శనగా వెళ్లి దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. పార్టీ నగర అధ్యక్షుడు అహమ్మద్ ఆలీఖాన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.
● కల్లూరులోని శరీన్ నగర్‌లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. జోహార్ వైఎస్సార్ అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. పార్టీ రీజినల్ అధ్యక్షురాలు గాజుల శ్వేతారెడ్డి, డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
● పెద్దటేకూర్‌లో వైఎస్సార్‌సీపీ నాయకుడు హనుమంతురెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అతిథిగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి హాజరయ్యారు.
● పత్తికొండ నియోజవర్గం తుగ్గలిలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణలతో కలిసి స్థానిక వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంక్షేమానికి మారుపేరుగా వైఎస్సార్ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారన్నారు.
● ఆదోని పట్టణంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు స్థానిక ఎస్‌కేడీ కాలనీలోని వైఎస్సార్ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్డు గోషాసుపత్రి వద్దనున్న వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. వైఎస్సార్ ఆశయాలను సాధిద్దామని పిలుపునిచ్చారు.
కల్లూరులో వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నాయకులు
కర్నూలు ఆర్‌ఎస్ రోడ్డులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్నమాజీ ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి
సంక్షేమానికి మారుపేరుగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భౌతికంగా దూరమై 16 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారు. ఊరూవాడా ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పాలనను గుర్తు చేసుకోవడంతో పాటు పార్టీలు, కులమతాలకు అతీతంగా కలిగిన లబ్ధిని స్మరించుకున్నారు. పారే నీటిలో ఆయన రూపమే కనిపిస్తుంది.. లక్షలాది గుండెల్లో ఆయన పేరు వినిపిస్తోంది.. ఒక్కో పథకం ఓ చరిత్ర. మంగళవారం మహానేత వర్ధంతి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నివాళులర్పించారు. జోహార్ వైఎస్సార్ నినాదాలను హోరెత్తించారు. ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో పాటు పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టి వైఎస్సార్‌పై అభిమానం చాటుకున్నారు. – కర్నూలు(టౌన్)
అందరివాడు వైఎస్సార్
పాణ్యం:దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అందరివాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం కల్లూరు మండల పరిధిలోని శరీన్‌నగర్‌లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాటమీద నిలబడే వ్యక్తిత్వం వైఎస్సార్ సొంతమన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో కొలువయ్యారన్నారు. రాయలసీమకు తలమానికమైన గోరుకల్లు జలాశయంతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. 1.92లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు గాలేరునగరి ద్వారా చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలకు తాగునీరు అందిస్తున్న ఘనత ఆయనదేనన్నారు. రైతు భరోసాతో పాటు ఉచిత విద్యుత్‌ను అందించి అన్నదాతకు అండగా నిలిచారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్‌తో వైఎస్సార్‌సీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తోందన్నారు. 1979లోనే ఇలాంటి బుక్‌లను ఎన్నో చూశామని, భయపడే ప్రసక్తే లేదన్నారు. అన్నింటికీ స్వస్తి పలికి ప్రజల కోసమే జీవిస్తున్నామన్నారు. పార్టీ శ్రేణులకు అన్నివిధాల అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.
వైఎస్సార్ స్ఫూర్తిని కొనసాగిద్దాం
కర్నూలు(టౌన్): ప్రజల గుండెల్లో కొలువైన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రతిన బూనుదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఎస్వీ కాంప్లెక్స్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ఆర్థికాభివృద్ధికి వైఎస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించి వేలాది ప్రాణాలను కాపాడారని గుర్తు చేశారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండింతలు ఎక్కువగా సంక్షేమాన్ని ప్రజల ఇళ్లకే చేర్చారన్నారు.

అభిమానం.. సజీవం!