ఓటమిపై విజయం! | - | Sakshi
Sakshi News home page

ఓటమిపై విజయం!

May 24 2023 8:00 AM | Updated on May 24 2023 8:05 AM

- - Sakshi

డాక్టర్‌ షేక్‌ హబీబుల్లా

సివిల్స్‌ సాధించాలని, ప్రజలకు సేవ చేయాలని చాలా మంది కల కంటారు. కొందరు మాత్రమే లక్ష్యానికి చేరుకుంటారు. ప్రయత్నం అంటూ చేయకపోతే ఉన్నత శిఖరాలకు చేరుకోవడం కష్టమనే విషయం తెలిసిందే. ఈ కోవలోనే ఒకటి, రెండుసార్లు ఒడిపోయినంత మాత్రాన కుంగిపోకుండా.. జిల్లాకు చెందిన ఇద్దరు యువత సివిల్స్‌ లక్ష్యాన్ని అందుకున్నారు. ఓటమిపై విజయం సాధించి బంగారు భవితకు బాటలు వేసుకుని భళా అనిపించారు. మంగళవారం వెలువడిన సివిల్స్‌ ఫలితాల్లో కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన డాక్టర్‌ షేక్‌ హబీబుల్లా 189వ ర్యాంకు.. ఆదోని పట్టణానికి చెందిన షమీర్‌రాజా 464వ ర్యాంకు సాధించి తమ కల నెరవేర్చుకున్నారు.

కర్నూలు(రాజ్‌విహార్‌): సివిల్స్‌ ఫలితాల్లో కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన డాక్టర్‌ షేక్‌ హబీబుల్లా ఆల్‌ ఇండియా స్థాయిలో 189వ ర్యాంకు సాధించారు. తండ్రి షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌ ప్రస్తుతం విద్యుత్‌ శాఖ ట్రాన్స్‌కోలో సూర్యపేట ఏడీఈగా విధులు నిర్వహిస్తుండగా తల్లి షేక్‌ గౌసియా బేగం గృహిణి. కాగా తాత షేక్‌ మహబూబ్‌ దౌల ప్యాలకుర్తిలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ పదవీ విరమణ పొందారు. తండ్రి ఉద్యోగ రీత్య హబీబుల్లా ప్రాథమిక విద్య సున్నిపెంటలో, ఆ తరువాత డోన్‌లో పూర్తి చేశారు. 2010లో కర్నూలులోని కేశవరెడ్డి స్కూల్‌లో 10వ తరగతి చదివి 559 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్‌ విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో 2012లో 935 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.

ఆ తర్వాత హైదరాబాద్‌లోని వెటర్నరీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. తండ్రి అడుగుజాడల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని, అది కూడా ఉన్న తంగా ఉండాలనే ఆలోచనలో సివిల్స్‌ వైపు అడుగులు వేశారు. కొంత కాలం విజయవాడలో ప్రాథమిక శిక్షణ తీసుకొని తొలి ప్రయత్నం చేసిన ఆయన 2021లో ఢిల్లీ వెళ్లారు. అక్కడ జామియా మిలియా యూనివర్సిటీలో శిక్షణ తీసుకున్నా రెండో ప్రయత్నంలోనూ ప్రిలిమ్స్‌కు అర్హత సాధించలేకపోయారు. లక్ష్య సాధన దిశగా మరింత ప్రయత్నం చేసి.. మూడో ప్రయత్నంలో 189వ ర్యాంకు సాధించారు.

ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఆంత్రోపాలజీని ఎంచుకోగా.. ప్రస్తుత ర్యాంకుకు ఐపీఎస్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు హబీబుల్లా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కుటుంబ సభ్యులు డాక్టర్‌ కావాలని బైపీసీలో చేర్పించగా.. వెటర్నరీ డాక్టర్‌ దిశగా తన పయనం సాగిందన్నారు. ఇతర ఏ ఉద్యోగం చేసినా ఆ సంతోషం కొంత వరకే ఉంటుందని, సివిల్స్‌లో రాణిస్తే ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు.

షమీర్‌రాజాకు ఆల్‌ ఇండియాలో 464వ ర్యాంకు
ఆదోని అర్బన్‌: పట్టణంలోని ఎస్కేడీ కాలనీలో నివాసముంటున్న నరసింహులు, ఉషా దంపతుల కుమారుడు షమీర్‌రాజా మంగళవారం విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో ఆల్‌ఇండియా స్థాయిలో 464వ ర్యాంకు సాధించారు. ఇతని తండ్రి నరసింహులు గుంతకల్‌ రైల్వేశాఖలో డీఆర్‌ఎం ఆఫీసు సూపరింటెండెంట్‌గా కాగా.. తల్లి గృహిణి. చెల్లెలు షర్మిల ఎంబీబీఎస్‌ పూర్తి చేసి రేడియాలాజీలో ఎండీగా శిక్షణ పొందుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న షమీర్‌రాజా ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. 1నుంచి 10వ తరగతి వరకు ఆదోనిలోని మిల్టన్‌ పాఠశాలలో, ఇంటర్‌ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో పూర్తి చేశానన్నారు.

ఆ తర్వాత వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో 2015లో బీటెక్‌ పూర్తయిందన్నారు. ఆ వెంటనే ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నట్లు చెప్పారు. ఆరుసార్లు సివిల్స్‌ పరీక్ష రాయగా.. ఇంటర్వూ వరకు వెళ్లి విఫలమయ్యాన న్నారు. 2020లో వచ్చిన ఫలితాల్లో 603 ర్యాంకు రాగా.. ప్రస్తుతం ఇండియన్‌ సివిల్‌ అకౌంట్స్‌ సర్వీస్‌లో మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగం చేస్తూనే 2022లో సివిల్స్‌ రాయగా.. ఆలిండియా స్థాయిలో 464వ ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ర్యాంకుతో ఐఆర్‌ఎస్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement