రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

Feb 8 2026 4:02 AM | Updated on Feb 8 2026 4:02 AM

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

కర్నూలు(సెంట్రల్‌): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్‌ సెంటర్‌ నంబర్‌ 1100కు ఫోన్‌ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్‌సైట్‌లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

9 నుంచి 11 వరకు ఏపీపీఎస్‌సీ పరీక్షలు

కర్నూలు(సెంట్రల్‌): అటవీ, ఎండోమెంట్‌ శాఖల్లోని ఫారెస్టు బీట్‌, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ మెయిన్స్‌, తండేల్‌(ఫారెస్టు), ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ గ్రేడు–2(ఎండోమెంట్‌) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ విడుదల చేసిన ఆఫ్‌లైన్‌ ఓఎంఆర్‌ బేస్‌డ్‌ పరీక్షలను ఫిబ్రవరి 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల సమన్వయాధికారి/డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ తెలిపారు. శనివారం ఆమె తన కార్యాలయంలో ఏపీపీఎస్‌సీ పరీక్షల సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రీక్షల నిర్వహణకు జిల్లాలో 7 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 9,958 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. అభ్యర్థులు హాల్‌ టిక్కెట్‌తోపాటు ఒక ఫొటో ఐడెంటిటీ కార్డుతో వస్తేనే లోపలికి అనుమతిస్తామన్నారు.

ఉల్లి పరిహారం అక్రమాలపై విచారణ

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉల్లి సాగు చేసిన రైతులకు పరిహారం చెల్లింపులో అక్రమాలపై జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి విచారణకు ఆదేశించారు. ‘సాక్షి’లో ఈనెల 7న ప్రచురితమైన ‘నష్టాన్ని దాచి.. కష్టాన్ని దోచి’ కథనానికి జిల్లా కలెక్టర్‌ స్పందించారు. ఇప్పటి వరకు అక్రమాలు దేవనకొండ మండలంలో వెలుగు చూశాయి. హార్టికల్చర్‌, రెవె న్యూ, వ్యవసాయ శాఖ అధికారులు ఒక బృందంగా ఏర్పడి దేవనకొండ మండలంలోని బేతపల్లి, బండపల్లి, బంటుపల్లి, చెల్లెలిచెలిమల గ్రామాల్లో విచారణ చేపట్టారు. మరో రెండు, మూడు రోజులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.

వాయిస్‌ క్లోనింగ్‌ మోసాలతో జాగ్రత్త

కర్నూలు: వాయిస్‌ క్లోనింగ్‌ ద్వారా బంధువుల గొంతుతో ఫోన్‌ చేసి డబ్బులు అడిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ జిల్లా ప్రజలకు సూచించారు. ఏఐ వాయిస్‌ క్లోనింగ్‌కు సంబంధించిన స్కామ్‌లు ఇటీవల చోటు చేసుకుంటున్నాయని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అత్యవసర ఆర్థిక సహాయం కోరితే వారి గుర్తింపును నిర్ధారించడానికి తెలిసిన, ధృవీకరించబడిన నంబర్‌ ద్వారా స్నేహితుడు లేదా బంధువులను సంప్రదించాలని పేర్కొన్నారు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే సైబర్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కు, www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement