బాధితుల ప్రయోజనాలు కాపాడాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి
కర్నూలు: ప్యానల్ న్యాయవాదులు ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ బాధితుల ప్రయోజనాలను కాపాడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా న్యాయ సేవా సదన్‌లో ప్యానల్ న్యాయవాదులకు, పారా లీగల్ వాలంటీర్లకు విధులు, బాధ్యతలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకటహరినాథ్ తదితరులు హాజరయ్యారు. ప్యానల్ న్యాయవాదులకు, పారా లీగల్ వాలంటీర్లకు వారి విధులు, విధానాలు, బాధ్యతలపై శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి మాట్లాడుతూ కోర్టు కేసుల నిర్వహణ, నిరుపేదల తరపున ట్రయల్ కోర్టు, ట్రిబ్యునల్స్, హైకోర్టు, సుప్రీం కోర్టుల వరకు కేసులు వాదించడం చేయాలని తెలిపారు. సమిష్టి పరిహారాలు, వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించడానికి లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం, సయోధ్య ద్వారా కృషి చేయాలని కోరారు. లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ పారా లీగల్ వాలంటీర్లు సమాజంలోని సామాన్య ప్రజలకు, న్యాయ సేవా సంస్థలకు మధ్య వారధిగా వ్యవహరించాలన్నారు.
బాధితుల ప్రయోజనాలు కాపాడాలి


