పదండి.. ‘కార్తికం’లోకి.. | - | Sakshi
Sakshi News home page

పదండి.. ‘కార్తికం’లోకి..

Nov 10 2026 1:37 AM | Updated on Nov 10 2026 1:37 AM

పదండి.. ‘కార్తికం’లోకి..

శైవక్షేత్రాలకు కేంద్రంగా విజయవాడ విశేష పూజలకు ముస్తాబైన ఆలయాలు డిసెంబర్‌ 8వ తేదీ వరకూ ప్రత్యేక కార్యక్రమాలు

నేటి నుంచి కార్తిక మాసోత్సవాలు ప్రారంభం

విజయవాడలోని పాతశివాలయం..

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఏడాదంతా ఎలా ఉన్నా.. కార్తికమాసంలో మాత్రం అంతటా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. ఈ మాసం వచ్చిందంటే ఆ సందడే వేరు.. శివయ్యకు ప్రతీపాత్రమైన మాసం కావడంతో ఆ యనను ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు స్నాన, జప, తప, దాన వ్రతాలు చేస్తూ భక్తిపారవశ్యంలో మునిగితేలుతారు. మంగళవారం నుంచి పవిత్ర కార్తిక మాసం ఆరంభం కానుండటంతో ఆ స్వామిని కనులారా వీక్షించి, పూజించి తరించాలని భక్తలోకం పరితపిస్తోంది. దీనికి ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు.. మన ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ పరిసరాల్లోనే ఎక్కడా లేనన్ని శైవ క్షేత్రాలు ఉన్నాయి. అనేక చారిత్రక అంశాలతో పాటుగా పురాణ ఇతిహాసాలతో ముడి పడిన ఆయా శైవాలయాల్లో కార్తిక పూజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇంద్రిగిరిపై మల్లేశ్వరస్వామి ఆలయం..

విశేష తేజస్సుతో కనకవర్ణంతో దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి పర్వతంపైనే ఈశ్వరుణ్ణి కూడా కొలువుండేలా చేయాలని భావించిన బ్రహ్మ అత్యంత భక్తిప్రపత్తులతో శతాశ్వమేథ యాగాల్ని చేశాడని.. బ్రహ్మ విశేష భక్తిశ్రద్ధలకు సంతసించిన పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంతో దర్శనమిచ్చినట్లు స్కంధ పురాణంలో పేర్కొన్నట్లు పండితులు చెబుతారు. కాలక్రమంలో కలిప్రభావం వల్ల ఈ జ్యోతిర్లింగం అదృశ్యంగా ఉండటాన్ని చూసిన శ్రీ శంకరాచార్యులు కనకదుర్గాదేవికి ఉత్తర భాగంలో ఈశాన్య దిశగా మల్లేశ్వర లింగాన్ని పునఃప్రతిష్ట చేశారు. ఏటా కార్తిక మాసంలో ఇక్కడ విశేష కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గాజుల అలంకారంతో పాటుగా భవానీదీక్షలను సైతం ఈ మాసంలో నిర్వహిస్తారు.

విజయేశ్వరస్వామి వారి ఆలయం

దుర్గగుడి దిగువన కనకదుర్గనగర్‌ సమీపంలో ఉందీ విజయేశ్వరస్వామి ఆలయం. పాశుపతాస్త్రం కోసం తపస్సు చేస్తున్న అర్జునిడికి పరమేశ్వరుడు నిజరూపంలో దర్శనమిచ్చి పాశుపతాస్త్రాన్ని బహూకరించాడని.. అర్జునుడు పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా స్తుతించి ఇంద్రకీలాద్రిపైనే దక్షిణ భాగాన ఒక శివలింగాన్ని ప్రతిష్టించాడని ప్రతీక. కాలక్రమంలో ఇదే విజయేశ్వరస్వామి ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. కార్తిక మాసాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఇక్కడ బిళ్వార్చన, రుద్రాభిషేకం తదితర కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

వన్‌టౌన్‌లోని బుద్ధు వారి గుడి..

వన్‌టౌన్‌ బ్రాహ్మణవీధిలో వేంచేసి ఉన్న శ్రీ వసంత మల్లికార్జునస్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన శివాలయం. బుద్ధు వంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఇక్కడ స్వామివారికి కార్తికమాసాన్ని పురస్కరించుకొని పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

గవర్నరుపేటలోని

కాశీ విశ్వేశ్వరుని ఆలయం..

గవర్నరుపేట చల్లపల్లి బంగ్లా సమీపంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి దేవస్థానంలో కార్తికమాసాన్ని పురస్కరించుకొని నిత్యం రుద్రాభిషేకం, రుద్రహోమాలను నిర్వహించేందుకు దేవస్థాన నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

వన్‌టౌన్‌లోని దర్భేశ్వరస్వామి ఆలయం..

వన్‌టౌన్‌ సైకంవారి వీధిలోని శ్రీ గంగా సమేత దర్భేశ్వరస్వామి వారి ఆలయంలో కార్తిక మాసంలో పలు విశేష పూజలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి రోజూ స్వామివారికి రుద్రాభిషేకం, మహాలింగార్చన తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు.

పాతశివాలయంగా పేరుగాంచిన విజయవాడలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి శ్రీశైల దేవస్థానం తర్వాత అంతటి ప్రాచీనత ఉందని పండితులు చెబుతారు. ఈ ఆలయాన్ని ధర్మరాజు ప్రతిష్టించాడని, అలాగే పశ్చిమ చాళుక్య రాజైన త్రిభువనమల్లుడు క్రీ.శ. పదో శతాబ్దంలో తన పేరుమీదుగా త్రిభువన మల్లేశ్వరాలయాన్ని నిర్మించారని చెబుతుంటారు. కార్తికమాసంలో ఈ ఆలయంలో ‘కార్త్తిక నక్త దీక్షా అభిషేక మహోత్సవం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆలయంలోని శ్రీ భ్రమరాంబ అమ్మవారు ఈ నెల రోజులూ రోజుకొక అలంకారంలో దర్శనమిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement