చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, ట్రైనీ కలెక్టర్ నమ్రత అగర్వాల్‌తో కలిసి కలెక్టర్ తన చాంబర్‌లో జిల్లా పంచాయతీ అధికారి, ఆర్డీవోలు, డీఎల్‌డీఓలు, ఇతర అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎలక్ట్రోరల్ రోల్స్ అత్యంత కీలకమని, ఓటర్ల వివరాలు, వార్డుల వారీగా ఓటర్ల మ్యాపింగ్‌లో ఎలాంటి పొరపాట్లు లేకుండా మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలోని హామ్లెట్లు, ప్రధాన గ్రామాల మధ్య ఓటర్ల విభజనను పరిశీలించి, సంబంధిత వార్డుల ఓటర్లు తమ వార్డు అభ్యర్థులకు ఓటు వేసే విధంగా జాబితాలు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు.
సరైన శిక్షణ ఇవ్వాలి..
ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సంబంధిత బీఎల్‌ఓలు మరోసారి వ్యక్తిగతంగా సందర్శించి, పోలింగ్ నిర్వహణకు భవనం అనువుగా ఉందా లేదా పరిశీలించాలని కలెక్టర్ చెప్పారు. పోలింగ్ కేంద్రాల వివరాలు, ఎన్నికల జాబితాలు, రిజర్వేషన్లు, బ్యాలె ట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, నామినేషన్ల స్వీకరణ, మానవ వనరుల వినియోగం, ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఎన్నికల విధులకు నియమితులైన ప్రతి అధికారి, సిబ్బందికి వారి బాధ్యతలపై స్పష్టమైన అవగాహన కల్పించేలా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. జెడ్పీ సీఈవో ఎం. శ్రీహరి, బందరు, గుడివాడ ఆర్డీవోలు కె. సాంబశివరావు, జి. బాలసుబ్రహ్మణ్యం, డీపీవో ఎం. ధనలక్ష్మి, బందరు, గుడివాడ, ఉయ్యూరు డీఎల్‌డీఓలు పి. శ్రీనివాస్, సునీత శర్మ, పి. స్వర్ణలత, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.


