బుడమేరుకు వరద
న్యూస్‌రీల్
వసతుల లేమితో ఇక్కట్లు..
మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రమైన కృష్ణా యూనివర్సిటీలో వసతుల లేమితో ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు ఇక్కట్లకు గురయ్యారు. ఉదయం 6 గంటలకు కృష్ణా యూనివర్సిటీ చేరుకున్న ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు ఎటువంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డారు. ఓ పక్క భారీ వర్షంతో మీడియా కేంద్రం ఏర్పాటు చేయకపోవటంతో వర్షంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. అలాగే అల్పాహారం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కౌంటర్లు గాలికి ఒరిగిపోవటంతో ఆ ప్రాంతంలో నిలబడే ఉద్యోగులు, మీడియా ప్రతి నిధులు తినాల్సి వచ్చింది. టిఫిన్ చేసేందుకు ఉద్యోగులు, ఏజెంట్లు ఒక్కసారిగా చిన్నటెంట్లోకి కౌంటర్ వద్దకు రావటంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది.
నిండా మునిగిన రైతన్న..
విజయవాడ జలమయం..
దిగువకు నీరు విడుదల..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం
● ఈదురు గాలుల ధాటికి
నేలకూలిన చెట్లు
● వైర్లు తెగి విద్యుత్ సరఫరాకు
అంతరాయం
● వరుస తుపానులతో రైతన్న
అతలాకుతలం
● నేడు విద్యా సంస్థలకు సెలవు
విజయవాడలోని ఆటోనగర్ వద్ద జలమయమైన రోడ్డు
తిరువూరు: స్థానిక మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. స్థానిక శ్రీవాహినీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో స్ట్రాంగ్ రూంను, ఓట్ల లెక్కింపు టేబుళ్లను కలెక్టర్ సందర్శించి సిబ్బందికి సూచనలిచ్చారు. తిరువూరు ఆర్డీవో ఎ. కుమార్, మునిసిపల్ కమిషనర్ మనోజ కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.
పాత్రికేయుల ఇక్కట్లు..
లెక్కింపు ప్రక్రియ కవరేజీకి వెళ్లిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు అధికారులు సహకరించలేదు. కౌంటింగ్ కేంద్రంలో రౌండ్ల వారీగా ఫలితాలు తెలిపే బోర్డు కూడా ఏర్పాటు చేయకపోగా, తుది ఫలితాలను కూడా అధికారికంగా ప్రకటించడంలో తీవ్ర జాప్యం చేశారు. కౌంటింగ్ ఏజెంట్లు ఇచ్చే సమాచారమే ఆధారమైంది. కనీసం కూర్చునే వీలు కూడా లేకుండా వర్షంలోనే తడుస్తూ పాత్రికేయులు ఇబ్బంది పడ్డారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మురసు తుపాను తీరం దాటిన తర్వాత విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణాజిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. సోమవారం రాత్రి నుంచి మొదలైన వర్షం మంగళవారం అర్ధరాత్రి వరకూ తెరిపి ఇవ్వలేదు. ఈ తుపాను ప్రభావంతో జనజీవనం స్తంభించింది. మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వర్షాలు కొనసాగుతుండటంతో బుధవారం రెండు జిల్లాల వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతోపాటు అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవు వర్తిస్తుందని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటన విడుదల చేశారు.
విజయవాడ నగరంలో పలు రోడ్లు జలమయమయ్యాయి. కొన్ని కాలనీలలో లోతట్టు ప్రాంతా లలో వర్షం నీరు చేరింది. విశాలాంధ్ర రోడ్డు, ఏఎస్ రామారావు రోడ్డు, మధుచౌక్, జమ్మిచెట్టు సెంటర్, సిద్ధార్థ స్కూల్ రోడ్డు, మదర్‌థెరీసా జంక్షన్, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు, నిర్మలా కాన్వెంట్రోడ్డు, నోవోటెల్ రోడ్లు వర్షం నీటితో నిండిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలలో చెట్లు నేలకూలాయి. చెట్టుకొమ్మలు విద్యుత్ లైన్లపై పడటంతో పలుచోట్ల విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలో కొండ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏ సమయంలో కొండచరియలు విరిగిపడాతాయోనన్న భయం వారిలో నెలకొంది. తుపాను ప్రభావం కారణంగా గన్నవరం విమానాశ్రయానికి రాకపోకలు సాగించే తొమ్మిది విమానాలను మంగళవారం రద్దు చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన సింగపూర్, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చైన్నె, కడప నుంచి ఇక్కడికి రాకపోకలు సాగించే ఎనిమిది విమానాలు రద్దయ్యాయి.
మురసు తుపానుతో రైతులు నష్టపోయారు. వారం రోజుల క్రితమే అర్నబ్ తుపానుతో రైతుల పంటలకు నష్టం జరగగా, మురుసు ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. మురసు తుపాను వల్ల కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో వరి నేలవాలింది. కోత దశకు వచ్చిన పంట దెబ్బతినడంతో కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు. వరి పంట పొట్టదశ, పాలుపోసుకున్న కంకులు బరువుతో వరి చాలా ప్రాంతాల్లో నేలపై పడ్డాయి. మోపిదేవి మండల పరిధిలోని కొక్కిలిగడ్డ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం వద్ద బాధితులు మంగళవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తుపాను ప్రభావంతో మండలంలో 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కొక్కిలిగడ్డ పంచాయతీ పరిధిలోని బండికోళ్లంక, బొబ్బర్లంక నదీ పరివాహక ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రానికి తరలివచ్చారు. ఆ సమయంలో కొంత మందిని మాత్రమే పునరావాస కేంద్రంలోనికి అనుమతించడం, మిగతా వారిని బయటికి పంపడంతో బాధితులు ఆందోళనకు దిగారు.
తుపాను కారణంగా స్థానిక పరీవాహక ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో కృష్ణానది దిగువకు సుమారు 5,000 నుంచి 10,000 క్యూసెక్కుల అదనపు నీటిని విడుదల చేసేందుకు ప్రకాశం బ్యారేజీ గేట్లను తెరవాలని నిర్ణయించారు. వాస్తవంగా వచ్చే నీటి ప్రవాహం, వినియోగాన్ని బట్టి విడుదల చేసే నీటి పరిమాణంలో మార్పులు ఉండవచ్చని అధికారులు తెలిపారు. దిగువన ఉన్న తీర ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను, ఇసుక రీచ్ నిర్వాహకులను ఇరిగేషన్ అధికారులు కోరారు.
గన్నవరం ఎస్సీ కాలనీలో ఇళ్లలోకి చేరిన వర్షం నీరు
నాగాయలంక మండలం చోడవరం ప్రాంతంలో నీట మునిగిన వరి పొలాలు
పెనమలూరులోని చోడవరం వద్ద నేలవాలిన వరి పైరు
పెడన మండలం లంకలకలువగుంట
ప్రాంతంలో నేలకొరిగిన వరి పంట
బందరులోని కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు చేస్తున్న సిబ్బంది
జి.కొండూరు: మురసు తుపాను ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి వర్షం పడుతుండటంతో మంగళవారం సాయంత్రానికి బుడమేరుకు కొద్దిమేర వరద ప్రవాహం ప్రారంభమైంది. ఎగువ ప్రాంతాలైన ఏ.కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు మండలాల నుంచి వరద కొద్దిగా ప్రారంభమై మంగళవారం సాయంత్రానికి 200 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతూ బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణానదిలో కలుస్తుంది. ఈ తుపాను ప్రభావంతో మంగళవారం రాత్రి కూడా వర్షం కొనసాగితే బుధవారం ఉదయానికి బుడమేరుకు భారీగా వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వెలగలేరు వద్ద బుడమేరుపై ఉన్న హెడ్‌రెగ్యులేటర్ వద్ద వరద ప్రవహం డెడ్ స్టోరేజీలో ఉన్నందున దిగువ ప్రాంతాల ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
వదంతులతో ఆందోళన..
బుడమేరుకు వరద పోటెత్తిందని, గండ్లు పడ్డాయని భారీ వరద ప్రవాహం అంతా దిగువ ప్రాంతాలైన విజయవాడ రూరల్ గ్రామాల మీదుకు వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సైతం బుడమేరుతో ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు ఒకవేళ బుడ మేరుకు వరద పోటెత్తితే లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని ఎటువంటి ఉదంతులను నమ్మి, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వీడియోను విడుదల చేశారు.


