రెమ్యూనరేషన్‌ ఇవ్వలేదని ఎన్నికల సిబ్బంది ఆవేదన | - | Sakshi
Sakshi News home page

రెమ్యూనరేషన్‌ ఇవ్వలేదని ఎన్నికల సిబ్బంది ఆవేదన

Nov 4 2026 2:20 AM | Updated on Nov 4 2026 2:20 AM

రెమ్యూనరేషన్‌ ఇవ్వలేదని ఎన్నికల సిబ్బంది ఆవేదన గుర్తు తెలియని వ్యక్తి మృతి తుపాను ప్రభావంతో నిలిచిపోయిన రైళ్లు

ఇబ్రహీంపట్నం: ఎన్నికల విధులకు సంబధించిన రెమ్యూనరేషన్‌ ఇవ్వలేదని కొండ పల్లి మునిసిపల్‌ ఎన్నికల్లో విధులు నిర్వహించిన సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 100 మందికి పైగా సిబ్బంది 19 రోజులు పనిచేయగా కేవలం నాలుగు రోజులకే చెల్లిస్తామనడం ఏమిటని మునిసిపల్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసును మంగళవారం ప్రశ్నించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, రూట్‌, స్టాటిస్టిక్‌ అధికారులుగా విధులు నిర్వహిస్తే కేవలం నాలుగు రోజులకు రెమ్యూనరేషన్‌ ఇస్తామనడం ఏమిటని నిలదీశారు. డ్రైవర్లకు రూ.3 వేలు ఇచ్చి చేతులు దులుపుకొన్న కమిషనర్‌ అధికారి స్థాయి వారికి కూడా రూ.3 వేలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. న్యాయపరమైన రెమ్యూనరేషన్‌తో పాటు టీఏ, డీఏ కూడా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశకు ఉద్యోగులు వినతిపత్రం పంపారు.

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గుణదల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. గుణదల పోలీసుల కథనం మేరకు.. గద్దల రమణ ఏలూరు రోడ్డులోని ఈఎస్‌ఐ బస్‌ స్టాప్‌ సమీపంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల రెండో తేదీ మధ్యాహ్నం డ్యూటీలో ఉండగా ఫుట్‌పాత్‌ పక్కన గుర్తు తెలియని కూర్చుని ఉండటాన్ని గుర్తించాడు. సాయంత్రం ఏడు గంటలకు అతను అక్కడే అచేతనంగా పడిపోయి కనిపించాడు. 108కు కాల్‌చేయగా అంబులెన్స్‌ సిబ్బంది వచ్చి అతడు మృతిచెందాడని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. మృతుడి వయసు 42 ఏళ్లు ఉంటుంది. అనుమానాస్పద మృతిగా గుణదల పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి సమాచారం తెలిసిన వారు తమను సంప్రదించాల్సిందిగా పోలీసులు కోరారు.

తాడేపల్లి రూరల్‌ / తెనాలి: మురసు తుపాన్‌ ప్రభావం రైల్వే శాఖపై కూడా పడింది. మంగళవారం విజయవాడ జంక్షన్‌ నుంచి తాడేపల్లి కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ మీదుగా చైన్నె, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లే రైల్వే మార్గాల్లో పలుచోట్ల సముద్ర తీర ప్రాంతంలో ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాడేపల్లి కృష్ణా కెనాల్‌ జంక్షన్‌లో ప్రధాన రైళ్లైన 22602 మధురై ఎక్స్‌ప్రెస్‌, 22185 ఎర్నాకులం ఎక్స్‌ ప్రెస్‌, 12510 చైన్నె వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు ప్యాసింజర్‌, గూడ్స్‌ రైళ్లను నిలిపివేశారు. చైన్నె రైల్వే ట్రాక్‌పై రాకపోకలు పునరుద్ధరించడంతో తాడేపల్లిలో నిలిచిన రైళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గంటల కొద్దీ కృష్ణా కెనాల్‌ జంక్షన్‌లో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆహారం, తాగునీరు అందుబాటులో లేక అవస్థలు పడ్డారు. ఈ మార్గంలో ప్రతి రైలూ ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే సిబ్బంది తెలిపారు.

దాతల సహకారంతో భోజనం

బాపట్ల, చినగంజాం వద్ద బలమైన గాలులు వీయడంతో విజయవాడ వైపు నుంచి వెళ్లే పలు రైళ్లను తెనాలి రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల తర్వాత తెనాలి చేరుకున్న న్యూఢిల్లీ – పాండిచ్చేరి (22404), విశాఖపట్నం – తిరుపతి (18507) రైళ్లను ఇక్కడే నిలిపివేశారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత 15 నిమిషాల వ్యవధిలో వాటిని ఇక్కడి నుంచి బయలుదేరేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సంఘమిత్ర సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12296) ఉదయం 6.30 గంట లకు తెనాలి చేరుకోగా, ఇక్కడే నిలిపివేశారు. ఈ రైలు సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి వెళ్లింది. తెనాలి రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయిన రైళ్లలోని ప్రయాణికులు దాదాపు 8 నుంచి 12 గంటల వరకు వేచి ఉండాల్సి వచ్చింది. రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ వెంకటరమణ సూచన మేరకు మండల తహసీల్దార్‌ కేవీ గోపాలకృష్ణ అక్కడికి చేరుకుని దాదాపు రెండు వేల మందికి పైగా ప్రయాణికులకు ఆహారం అందజేశారు. సింహపురి, బోకారో రైళ్లను తెనాలిలో కొంతసేపు నిలిపివేసి, ఆయా రైళ్లలోని ప్రయాణికులకు కూడా ఆహారం అందించారు. పట్టణానికి చెందిన శ్రీచంద్రశేఖర గురుపాదుకా పీఠం నిర్వాహకులు రామకృష్ణశర్మ సహకారంతో 1,500 మందికి, తహసీల్దార్‌ గోపాలకృష్ణ వితరణతో మరో 500 మందికి పైగా ప్రయాణికులకు భోజనం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement