ఆక్రమణల తొలగింపు ఏది?
కూటమి సర్కారు తప్పిదంతోనే విపత్తు
రూ. వందల కోట్ల ఆస్తినష్టం
పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి
రూ. 6,500 కోట్లు కావాలని కేంద్రానికి లేఖ
ఒక్కపైసా ఖర్చు పెట్టలేదు
కాగితాలకే పరిమితమైన ‘ఆపరేషన్ బుడమేరు’
కన్నీటి వరద.. మానని గాయం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడను పైసా అభివృద్ధి చేయకపోగా, బుడమేరు వరదతో సగం నగరాన్ని ముంచేశారు. కేవలం ప్రభుత్వ తప్పిదంతోనే లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. వందల కోట్ల ఆస్తినష్టం సంభవించింది. పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ ఎంతమంది మరణించింది లెక్క తేల్చలేదు. బుడమేరు సహాయక చర్యల పేరుతో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారు. బయట మునిసిపాలిటీల నుంచి ఆహారపదార్థాలు తెప్పించి కోట్లలో బిల్లులు పెట్టారు. గుంటూరు మునిసిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులపై తొమ్మిదిన్నర కోట్ల రూపాయల అవినీతి చేశారంటూ అప్పటి గుంటూరు డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు హైకోర్టులో కేసు వేశారు. విజయవాడలో బుడమేరు వరద సహాయక కార్యక్రమాల కోసం ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా విరాళాలు వచ్చాయని వాటిని ఏం చేశారో చెప్పాలంటూ సొంత సామాజిక వర్గ నేతలే నిలదీస్తున్న పరిస్థితి కనపడుతోంది.
ఒకవైపు కృష్ణానదికి వరద పోటెత్తుతుండగా, బుడమేరు పరీవాహక ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నా ప్రభుత్వం మేల్కొలేదు. కృష్ణానది కరకట్ట పక్కనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిని కాపాడుకునేందుకు బుడమేరుకు వెలగలేరు వద్ద రెగ్యులేటర్ గేట్లను ఎత్తివేశారని, బుడమేరు కింది ప్రాంత ప్రజలపై విరుచుకుపడుతుందని తెలిసినా ముంపు ప్రాంతాల ప్రజల్ని కనీసం అప్రమత్తం చేయలేదన్న ఆరోపణలు వచ్చాయి. 2,400 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న చోట ఏకంగా 33వేల క్యూసెక్కుల వరద రావడం, దాన్ని ప్రభుత్వం సకాలంలో గుర్తించి చర్యలు తీసుకోకపోవడం, చివరి క్షణాల్లో వెలగలేరు రెగ్యులేటర్ వద్ద గేట్లు ఎత్తివేయడంతో విజయవాడలోని 32 డివిజన్లలో సుమారు 2.62 లక్షల మంది ప్రజలు వరద ప్రభావానికి గురై సర్వస్వం కోల్పోయారు. రోజుల తరబడి బిక్కుబిక్కుమంటూ గడిపారు. నగర శివారు ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు సుమారు 50.6 కిలోమీటర్ల మేర బుడమేరు కాలువగట్లకు గండ్లు పడటం, ముఖ్యంగా విజయవాడ రూరల్‌లోని వేల్పూరు ప్రాంతంలో ఏర్పడిన పెద్ద గండ్లు బుడమేరు రక్షణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో స్పష్టం చేశాయి. 33 వేల క్యూసెక్కుల నీటిమట్టం వచ్చే వరకూ ఎందుకు గేట్లు ఎత్తకుండా చోద్యం చూశారన్నదానిపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి వివరణ రాలేదు. బాధ్యులపై చర్యలూ లేవు.
విజయవాడలో బుడమేరు వెడల్పు ప్రాంతాన్ని బట్టి 50 నుంచి 120 అడుగుల వరకు ఉండేది. అయితే ఆక్రమణల కారణంగా అనేక ప్రాంతాల్లో కాలువ క్రమంగా కుంచించుకుపోయింది. విజయవాడ నగర పరిధిలోనే సుమారు బుడమేరు 380 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఒక అంచనా. బుడమేరు పరీవాహక ప్రాంతంలో సుమారు 3,051 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నారు. న్యూ రాజరాజేశ్వరీపేటలో బుడమేరును మట్టితో పూడ్చి దాని మీద నిర్మాణాలు చేపట్టారు. చిన్న రేకుల ఇళ్ల నుంచి నుంచి బహుళ అంతస్తుల భవనాల వరకు నిర్మాణాలు వెలిశాయి. ఒకవైపు నగరంలో బుడమేరు భూమిని ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తుంటే, మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కాలువ భూములను ఆక్రమించి సాగు చేస్తున్నారు. విజయవాడ నగర పరిధిలో బుడమేరు కనీసం 7,000–10,000 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో ఉంటేనే భారీ వర్షాల సమయంలో ముప్పును తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆక్రమణల తొలగింపు, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కోసం స్థలం కేటాయించడం లేనిపక్షంలో ఇళ్లు నిర్మించి ఇవ్వడం, బుడమేరు గట్లను పటిష్టం చేయడం, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టడం తదితర పనులకు సుమారు రూ.5,222 కోట్లతో డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో రెండేళ్ల తర్వాత కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
రెండేళ్ల క్రితం బుడమేరు సృష్టించిన బీభత్సాన్ని విజయవాడ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. గత నెలలో తుపాను వచ్చినప్పుడు కూడా భయంతో వణికిపోయారు. భారీ వర్షం పడిందంటే ఆ రోజు విజయవాడలోని సగం ప్రాంతంలోని ప్రజలకు కంటిమీద కునుకు ఉండని పరిస్థితి ఏర్పడుతోంది. అయినా ప్రభుత్వం ఏ మాత్రం మేల్కొనడం లేదు. విజయవాడ ప్రజల భద్రతను గాలికి వదిలేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుడమేరును పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని ఇచ్చిన హామీలు కూడా అలాగే ఉండిపోయాయి. బుడమేరు ప్రక్షాళన దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. బుడమేరు ప్రక్షాళనకు 6,500 కోట్ల రూపాయలు కావాలని కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకొన్నారు. అక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కారే ఉన్నా కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్కపైసా బుడమేరు ఆధునికీకరణ కోసం కేటాయించలేదు. మునిసిపల్ ఎన్నికల పేరుతో ప్రజల ముందుకు వస్తున్న కూటమి ప్రజాప్రతినిధులు దీనిపై ఏం సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే.


